రెండు తలల పాము రూ.70 లక్షలు.. ఇంట్లో ఉంటే అదృష్టమంటూ..!

టెక్నాలజీ ఇంత పెరుగుతున్నా మూఢనమ్మకాలను గుడ్డిగా నమ్మేవాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని తమ వలలో వేసుకుంటున్నారు మోసగాళ్లు.. ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ముఠాను అటవీశాఖ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రెండు తలల పాము ఇంట్లో ఉంటే అదృష్టమని, గుప్తనిధులు దొరుకుతాయని ఓ రెండు తలల పామును అమ్మకానికి పెట్టారు. ఈ విషయం తెలిసి విజిలెన్స్ డీఎఫ్ఓ సుధాకర్ రెడ్డి నేతృత్వంలో దాడి చేసి ఈసీఐఎల్ సమీపంలోని నాగారంలో ఉన్న సగ్గుర్తి రోహిత్, జాలిగ శ్రీధర్, రాయుడు వెంకటరమణ, వీ.ఆంజనేయప్రసాద్ తో కూడిన ముఠాను అదుపులోకి తీసుకున్నారు. రెండు తలలు కలిగి 4.5 కేజీల బరువున్న ఈ పామును రూ.70 లక్షలకు అమ్మకానికి పెట్టారు.

నిందితుల నుంచి కారు, టూవీలర్, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులను మేడ్చల్ కోర్టులో హాజరుపరిచారు. ఈ ముఠాను పట్టుకున్నందుకున్న అధికారులను అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్) ఆర్.శోభ అభినందించారు. కేవలం మూఢ నమ్మకాలను నమ్మే వారిని గుర్తించి కొందరు ఈ విధమైన మోసాలకు పాల్పడుతున్నారని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు తలల పాముగా పిలిచే ‘రెడ్ సాండ్ బోవా’కు వాస్తవానికి రెండు తలలు ఉండవని స్పష్టం చేశారు.

Leave a Comment