ఒకే అమ్మాయిని ప్రేమించిన ఇద్దరు అన్నదమ్ములు.. వీడియో తీసి ఆత్మహత్య..!

ఇద్దరు అన్నదమ్ములు.. ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే అమ్మాయిని ప్రేమించారు. చివరికి ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రాజస్తాన్ లోని బుంది జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల మేరకు జిల్లాలోని కేశవ్ పుర గ్రామానికి చెందిన మహేంద్ర గుర్జర్(23), దేవ్ రాజ్ గుర్జర్(23) ఇద్దరు వరుసకు అన్నదమ్ములు..

ఇద్దరూ ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే అమ్మాయిని ప్రేమించారు.  ఆమెతోనే జీవితం అనుకున్నారు. తమ లవర్ పేరును ఇద్దరూ పచ్చబొట్లు వేయించుకున్నారు. అయితే ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించిన విషయం తెలిసి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఆ తర్వాత ఇద్దరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

అయితే ఆత్మహత్య చేసుకునే ముందు వీరిద్దరు వీడియో రికార్డు చేశారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని ఆ వీడియోలో చెప్పారు. తాము ప్రేమిస్తున్న యువతిని మంచి అబ్బాయితో పెళ్లి చేయాలని కోరారు. వ్యక్తిగత కారణాలతోనే తాము చనిపోతున్నామని, తమ చావుకు ఎవరినీ నిందించవద్దని వీడియోలో తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

Leave a Comment