విభజన సమయంలో విడిపోయి.. 75 ఏళ్ల తర్వాత కలిసిన అన్నదమ్ములు..!

దశాబ్దాల క్రితం విడిపోయిన అన్నదమ్ములు కలిస్తే ఎలా ఉంటుంది? వారి ఆనందానికి అవధులు ఉండవు కదూ.. 74 ఏళ్ల క్రితం విడిపోయిన అన్నదమ్ములు ఇన్నేళ్ల తర్వాత కలుసుకున్నారు. ఈ ఆనందంలో సోదరులిద్దరూ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కంటతడి పెట్టుకున్నారు. 

80 ఏళ్ల మహ్మద్ సిద్ధిక్, 78 ఏళ్ల మహ్మద్ హబీబ్ అనే అన్నదమ్ములు 74 ఏళ్ల క్రితం భారత్-పాక్ సరిహద్దుల్లో జరిగిన విభజన సమయంలో విడిపోయారు. అప్పుడు వీరి కుటుంబం జలంధర్ నుంచి పాకిస్తాన్ వెళ్లింది. సోదరి, తల్లితో కలిసి హబీబ్ అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. సరిగ్గా అదేసమయంలో విభజన జరిగింది. సిద్ధిక్ మాత్రం తన నాన్న, అక్కతో కలిసి ఫైసలాబాద్ లోని శరణార్థి శిబిరానికి చేరుకున్నాడు. అక్కడ సిద్ధిక్ అక్క జబ్బు పడి చనిపోగా, చాలా రోజుల తర్వాత తండ్రి అక్కడికి వచ్చాడు.. 

ఇక హబీబ్ తో ఉన్న అమ్మ కూడా చనిపోయింది. ఆమె పుట్టింటి వారు కూడా పాకిస్తాన్ వెళ్లిపోయారు. సర్దార్ అనే స్నేహితుడితో హబీబ్ ఉండిపోయాడు. హబీబ్ అమ్మమ్మ వారు కూడా పాకిస్తాన్ వెళ్లిపోవడంతో ఇక సంబంధం లేకుండా పోయింది. సిద్ధిక్ మాత్రం తన మేనమామల వద్ద పెరిగాడు. ఫైసలాబాద్ లో కొంతకాలం ఉన్న తర్వాత చక్ 255లో వ్యవసాయం చేస్తూ పెళ్లి చేసుకున్నాడు. హబీబ్ మాత్రం పెళ్లి చేసుకోలేదు.. సర్దార్ కుటుంబంతోనే ఉన్నాడు.. అయితే సిద్ధిక్ కి మాత్రం తన తమ్ముడు బతికే ఉన్నాడని నమ్మకం ఉండేది. 

తాము విడిపోయిన విషయాన్ని సిద్దిక్ తన మిత్రుడి కొడుకు మహ్మద్ ఇష్రాక్ కి చెప్పాడు. నసీర్ ధిల్లాన్ అనే వ్యక్తి సాయంతో ఇష్రాక్ ఓ వీడియో తీశాడు. కొన్ని రోజుల తర్వాత హబీబ్ ఆచూకి తెలియడంతో అన్నదమ్ములను ఫోన్లో మాట్లాడించారు. హబీబ్ పాకిస్తాన్ రావాలని, అది సాధ్యం కాకపోతే సిద్ధిక్ ఇండియా వెళ్లాలని అనుకున్నారు. కరోనా కారణంగా లేట్ అయ్యింది. ఇన్నాళ్లకు కార్తార్ పూర్ కారిడార్ తెరవడంతో 74 ఏళ్ల తర్వాత సోదరులిద్దరు కలుసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. 

 

Leave a Comment