షమీపై దారుణంగా ట్రోలింగ్.. షమీకి మద్దతు తెలిపిన మాజీలు..!

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ పై టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే.. ఈ ఓటమి తర్వాత టీమిండియా పేసర్ మహ్మద్ షమీ దారుణంగా ట్రోలింగ్ కు గురవుతున్నాడు. సోషల్ మీడియాను లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ చేస్తున్నారు.

 మహ్మద్ షమీ ఈ మ్యాచ్ లో 3.5 ఓవర్లలో 43 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో పాకిస్తాన్ పై భారత్ ఓడిపోవడానికి షమీ కారణమంటూ కొందరు దురాభిమానులు దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. షమీ పాక్ కు అమ్ముడుపోయాడని, అతన్ని పాక్ కు తరమికొట్టాలని భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. షమీ ఓ ముస్లిం అయినందు వల్ల మతం రంగు పులుముతున్నారు.  

షమీకి మాజీల మద్దతు..

ఈక్రమంలో మహ్మద్ షమీకి టీమిండియా మాజీ ప్లేయర్లు మద్దతుగా నిలిచారు. ‘మేము టీమిండియాకు మద్దతు ఇచ్చినప్పుడు.. ఒకరికాదు. జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి వ్యక్తికి మా మద్దతు ఉంటుంది. మహ్మద్ షమీ నిబద్ధత కలిగిన ప్రపంచ స్థాయి బౌలర్. ఇది అతనికి మంచి రోజు కాదు. అది ఏ ఆటగాడికైనా జరగవచ్చు. నేను షమీ టీమిండియాతో ఉన్నాను’ అంటూ టీమిండియా మాజీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు. 

షోషల్ మీడియాలో మహ్మద్ షమీని టార్గెట్ చేయడం షాకింగ్ గా ఉంది. మేము అతనితో ఉన్నాము. జట్టు మూకుమ్మడిగా విఫలమైతే షమీ ఒక్కడు మాత్రం ఏం చేయగలడు. షమీ ఓ ఛాంపియన్ బౌలర్.. టీమిండియా క్యాప్ ధరించిన ప్రతి ఆటగాడు తమ హృదయాల్లో భారతీయత కలగి ఉంటాడు. కొందరు అల్లరి మూకలు ఉద్దేశపూర్వకంగా మాటల దాడులకు తెగబడుతున్నారు. ఇది ఏమాత్రం సమంజసం కాదు అని టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించారు.

రాజకీయ నేతల మద్దతు..

టీమిండియా ప్లేయర్ మహ్మద్ షమీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం మద్దతు తెలిపారు. మహ్మద్ షమీ మేమంతా మీ వెంటే ఉన్నామని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా కామెంట్లపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఖండించారు. టీమిండియాలో 11 మంది ప్లేయర్లు ఉండగా.. ఒక్క షమీని మాత్రమే ఓటమికి ఎందుకు బాధ్యుడ్ని చేస్తున్నారని ప్రశ్నించారు. దీనికి బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.   

Leave a Comment