తొలిసారిగా ఓ బిడ్డకు తల్లి, తండ్రి ఒక్కరే..!

తొలిసారిగా ఓ బిడ్డకు తల్లి, తండ్రి ఒక్కరే అవుతున్నారు. అందు కోసం ఓ ట్రాన్స్ వుమెన్ తన వీర్యాన్ని భద్రపరుచుకుంది. భవిష్యత్తులో దీని ద్వారా ఆమె బిడ్డను కనాలని భావిస్తోంది. ఇలా జన్మించిన బిడ్డకు ఆమె తల్లి, తండ్రి అవుతుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన జిస్నూర్ దయారా తొలి ట్రాన్స్ వుమెన్ గా రికార్డు సృష్టించింది. త్వరలో సర్జరీ ద్వారా పూర్తి మహిళగా మారనుంది. 

దయారా పుట్టడం మగ పిల్లాడిగానే పుట్టింది. అయితే ఆమెకు చిన్నప్పటి నుంచి ఆడవారిగా జీవించాలని, వారిలాగా చీరలు కట్టుకోవాలని ఉండేది. కానీ సమాజం ఏమనుకుంటుందో అని తనలోని భావాలని బయటకు రానివ్వలేదు. అయితే ఆమె ఎంబీబీఎస్ చదివేందుకు రష్యా వెళ్లింది.  అక్కడ తన లాంటి వారు తమకు నచ్చినట్లు బతకడం చూసి ఆమెకు ధైర్యం వచ్చింది.
ఇక తనలోని భయాలను తొలగించుకుంది. తనకు నచ్చినట్లు బతకడం మొదలుపెట్టింది. చీర కట్టుకోవడం, లిప్ స్టిక్ వేసుకోవడం నేర్చుకుంది. అయితే ఆమె తల్లిదండ్రులు మొదట్లో తనను చూసి ఇబ్బంది పడ్డారు. తర్వాత వారు ఆమెను అర్థం చేసుకున్నారు. ఇక సమాజం కూడా తనను అంగీకరించడం ప్రారంభించింది. 

దయారా త్వరలో శస్త్ర చికిత్స ద్వారా పూర్తి స్త్రీగా మారనుంది. అయితే ఆమెకు తల్లి కావాలని కోరిక ఉంది. అందు కోసం తానే తల్లి కావాలని భావించింది. అందు కోసం లింగ మార్పిడికి ముందే తన వీర్యాన్ని అహ్మదాబాద్, ఆనంద్ లోని ఓ ఐవీఎఫ్ ఆస్పత్రిలో భద్రపరుచుకుంది. ప్రస్తుతం దయారా ఇండియాలో ప్రాక్టీస్ చేయడం కోసం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే పరీక్ష రాయబోతుంది. 

బిడ్డను కనడం కోసం సరోగసి విధానాన్ని ఎంచుకోబోతున్నట్లు దయారా చెప్పుకొచ్చింది. తన బిడ్డకు బయాలజీకల్ గా తానే తల్లి, తండ్రి అవుతానని తెలిపింది. ఇది తనకు గర్వంగా ఉందని చెప్పింది. మొట్టమొదటి సారి ఓ ట్రాన్స్ వుమెన్ భవిష్యత్తులో తల్లి అవ్వడం కోసం తన వీర్యాన్ని తమ ఆస్పత్రిలో భద్రపరుచుకోవడం తమ ఆస్పత్రిలో ఇదే తొలిసారి అని దయారా వీర్యాన్ని భద్రపరిచిన వైద్యుడు డాక్టర్ నయానా పటేల్ తెలిపారు.  

 

Leave a Comment