జీలకర్ర బెల్లం పెడుతుండగా.. పెళ్లి పీటలపై వధువు మృతి..!

విశాఖలో పెళ్లింట విషాదం జరిగింది. పెళ్లి పీటలపై కూర్చున్న నవ వధువు తలపై జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగా… గురువారం రాత్రి ఆమె మృతి చెందింది. మధురవాడ కళానగర్ కి చెందిన నాగోతి శివాజీకి, హైదరాబాద్ కి చెందిన ముంజేటి సాయి సృజన(22)కు ఈనెల 11న పెళ్లి నిశ్చయమైంది. 

ఈనేపథ్యంలో మూడు రోజులుగా ఇద్దరి ఇళ్లలో పలు కార్యక్రమాలు జరిగాయి. బుధవారం జరిగిన పలు కార్యక్రమాలు వధూవరులిద్దరూ పాల్గొన్నారు. అయితే ముహూర్తం సమయం దగ్గర పడుతుండగా వధువుకు నీరసంగా అనిపించింది. వరుడు జీలకర్ర, బెల్లం పెడుతున్న సమయంలో వదువు అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఆమె చనిపోయింది. 

ఎన్నో అనుమానాలు.. 

అయితే వధువు మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుర్తు తెలియని విష పదార్థాన్ని తీసుకోవడం వల్ల సృజన మృతి చెందినట్లు చికిత్స చేసిన వైద్యులు తెలిపారు. పోస్టు మార్టం నివేదిక వస్తే పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు చెబుతున్నారు. మృతురాలి బ్యాగులో గన్నేరు పుప్పు తొక్కలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. గన్నేరు పప్పు తిని చనిపోయిందా? లేదా మరే కారణం ఏమైన ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

 

   

 

Leave a Comment