మార్కులు, గ్రేడ్ లా ఆధారంగానే ఎమ్మెల్యేలకు టికెట్.. డేంజర్ జోన్ లో 40 మంది..!

2024లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎలాగైనా 175 స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఎమ్మెల్యేల పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టింది వైసీపీ అధిష్టానం.. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తోంది.. ఎవరికైనా మార్కులు, గ్రేడ్లు తగ్గితే మాత్రం టికెట్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకపోతే మంత్రులకు ఉద్వాసన తప్పదని సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చారట.. మార్కులు, గ్రేడ్ ల ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరును విశ్లేషించడానికి సమీక్షకు సిద్దమైనట్లు సమాచారం.. 

సీఎం జగన్ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నారు. అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేయడంతోపాటు వైజాగ్, కర్నూలులో కార్యనిర్వాహక రాజధాని, న్యాయ రాజధాని ఏర్పాటుపై సీఎం జగన్ తన వైఖరిని మళ్లీ స్పష్టం చేశారు. వికేంద్రీకృత అభివృద్ధికే తమ ప్రభుత్వం మెుగ్గు చూపుతుందని మరోసారి చెప్పారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకే మూడు రాజధానుల నిర్ణయాన్ని వైసీపీ  ప్రధాన అజెండాగా జగన్ స్వీకరించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం అసెంబ్టీ సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో సభ్యులందరూ అందుబాటులో ఉన్నారు. మరో మూడు రోజుల్లో ఎప్పుడైనా ఎమ్మెల్యే పనితీరుపై జగన్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరును జగన్ విశ్లేషించనున్నారు. అంతకు ముందు జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరు మెరుగుపడేందుకు ఎనిమిది నెలల సమయం ఇచ్చారు. ఎప్పటికప్పుడు వారి స్కోర్‌లను సమీక్షిస్తానని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే ఐపాక్ బృందాలు, ఇతర సర్వే ఏజెన్సీలు జగన్ కు నివేదికలు సమర్పిస్తున్నాయి.

అయితే సుమారు 60 మంది వైసీపీ శాసనసభ్యులు పనితీరు బాగాలేదని తేలింది. జగన్ వారికి సమయం ఇచ్చారు. 12 మంది శాసనసభ్యుల పనితీరు మెరుగుపడింది. ఎమ్మెల్యేలకు గ్రేడ్‌లు, మార్కులు ఇవ్వడం ద్వారా వారి పనితీరుపై సీఎం సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో ఆయన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారని, సిట్టింగ్ ఎమ్మెల్యేల రేటింగ్స్ ఆధారంగా టిక్కెట్లపై స్పష్టత ఇస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతా ప్రాతిపదికన జగన్ ప్రతి నియోజకవర్గానికి నిధులు ఇస్తున్నారు. అయితే దాదాపు 40 మంది శాసనసభ్యులు ఇప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, అందుకే వారు డేంజర్ జోన్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది.

 

 

Leave a Comment