‘హింగ్’ అమ్ముతూ..నెలకు రూ.25 లక్షలు సంపాదిస్తున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు..!

ప్రస్తుతం చదివిన చదువుకు తగ్గ ఉద్యోగాలు లభించడం లేదు. దీంతో చాలా మంది డిగ్రీలు, పీజీలు చేసి సొంతంగా వ్యాపారంలో రాణించాలని అనుకుంటున్నారు. అదేవిధంగా కేరళకు చెందిన ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు కూడా సొంతంగా బిజినెస్ చేయాలని అనుకున్నారు. ఇంగువ బిజినెస్ ని ప్రారంభించి నెలకు రూ.25 లక్షలు సంపాదిస్తున్నారు.. ఎంతో మంది యువతకు ఇన్ స్పిరేషన్ గా నిలిచారు.

కేరళకు చెందిన వర్షాప్రశాంత్ ఎంబీఏ పూర్తి చేసింది. మూడేళ్ల క్రితం సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని భావించింది. అందుకు వర్ష తన ఇద్దరు చెల్లెళ్లు విస్మయ, వ్రిందాలను కూడా కలుపుకుంది. తర్వాత వారు ఆహార ఉత్పత్తి యూనిట్ కాన్సెప్ట్ కోసం ప్రయత్నాలు చేశారు. ‘3వీస్’ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించి ఇంగువ వ్యాపారం మొదలుపెట్టారు. ఇంగువతో మంచి పేరు తెచ్చుకున్న తర్వాత 30 రకాల ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసినట్లు ఈ అక్కాచెల్లెళ్లు వివరించారు. 

ఎర్నాకులంలోని కలమస్సేరిలో కంపెనీ తయారీ యూనిట్ ఉంది. అక్కడ వర్షప్రశాంత రోజువారి కార్యకలాపాలు, చార్టర్డ్ అకౌంట్ విద్యార్థి అయిన విస్మయ ఆర్థిక వ్యవహారాలు, బీబీఏ పూర్తి చేసిన వ్రిందా డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా ప్రమోషన్స్ చూసుకుంటారు.. ఇక తల్లిదండ్రులు కూడా వీరికి మద్దతుగా పనులు షేర్ చేసుకుంటారు. 

ముద్రా లోన్, రూ.2 లక్షల పెట్టుబడితో ఈ కంపెనీని ప్రారంభించినట్లు వర్ష తెలిపారు. అంతకు ముందు ఉత్పత్తికి సంబంధించిన ప్రాసెస్ తెలుసుకోవడానికి అగ్రోపార్క్ నుంచి శిక్షణ తీసుకుంది. మొదట్లో వర్ష ఒక్కరే కంపెనీని ప్రారంభించింది. తర్వాత తన చెల్లెళ్లను పార్టనర్స్ గా చేసుకుని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేసింది. ప్రస్తుతం ఈ కంపెనీలో 30 మంది ఎంప్లాయిస్ ఉన్నారు. ఇంగువను తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలన ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముంబైలోని డీలర్ల ద్వారా వీరికి చేరుకుంటాయి.   

మొదట్లో ఇంగువ రుచి, వాసనకు సంబంధించి ఫిర్యాదు వచ్చాయి. ఇంగువ బాగోలేదని రివ్వ్యూలు వచ్చాయి. దీంతో తయారీలో మార్పులు చేసి విడుదల చేశారు. ఈ-కామర్స్ ప్లాట్ ఫారమ్ ల ద్వారా కూడా మంచి విక్రయాలు జరుగుతున్నట్లు వ్రిందా తెలిపింది. మొదట్లో అద్దె ఇంట్లో ప్రారంభించిన ఈ కంపెనీ ఇప్పుడు 50 లక్షల రూపాయల విలువైన యంత్రాలతో నడుస్తోంది. 

ఎర్నాకులం, అలప్పుజ, పత్తనంతిట్ట వంటి ఇతర జిల్లాల్లో డైరెక్ట్ సేల్స్ ద్వారా వీరికి ఆర్డర్లు నెమ్మదిగా వచ్చాయి. కేరళ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ తో కలిసి పనిచేయడం ద్వారా అమ్మకాలు పెరిగాయి. 2019 వరదల సమయంలో కార్పొరేషన్ కు ఉత్పత్తులను సరఫరా చేయడం ప్రారంభించారు. దానిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇది గత మూడు నాలుగు నెలలుగా రూ.25 లక్షల మార్జిన్ ని చేరుకోవడానికి సహాయపడినట్లు వర్ష చెప్పారు. 

‘3వీస్’ కంపెనీ నుంచి పసుపు, కారం, కొత్తిమీర, సాంబార్, మిరియాలు, చికెన్ మసాలా పొడులను విక్రయిస్తున్నారు. కేరళలోని 2000కు పైగా అవుట్ లెట్లకు 3వీస్ ప్రొడెక్ట్స్ అందించడానికి అనుమతి తీసుకున్నారు. అయితే అమ్మకాలను మాత్రం కొన్నింటికే పరిమిత చేశారు. రాబోయే నాలుగేళ్లలో కంపెనీని అంతర్జాతీయ బ్రాండ్ గా మార్చాలని ప్లాన్ చేస్తున్నట్లు విస్మయ చెప్పారు. కేవలం 20 లలో బాధ్యాతాయుతమైన వ్యాపార పద్ధతులు, నైపుణ్యాలతో కొత్త వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు.  

Leave a Comment