భయపడ్డ దొంగలు.. ‘పీడ కలలు వస్తున్నాయని’.. దేవుని విగ్రహాలు తిరిగిచ్చేశారు..!

దేవుడి విగ్రహాలను దొంగలించిన దొంగలకు నిద్రపట్టలేదు.. పీడకలలు వస్తున్నాయి. దీంతో దేవుడి విగ్రహాలను తిరిగిచ్చేశారు.. విగ్రహాలను పూజారి ఇంటి ముందు వదిలేసి వెళ్లిపోయారు. పీడకలలు వస్తున్నాయంటూ లేఖ రాసి వెళ్లారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని చిత్రకూట్ లో జరిగింది. 

ఈనెల 9న చిత్రకూట్ లోని బాలాజీ ఆలయంలో 16 దేవుడి విగ్రహాలు చోరీకి గురయ్యాయి. దీంతో ఆలయ పూజారీ మహంత్ రామ బాలక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగల కోసం వేట మొదలుపెట్టారు. అయితే అనూహ్యంగా ఆదివారం రాత్రి పూజారీ తన ఇంటికి సమీపంలో ఓ సంచి పడి ఉండటాన్ని గమనించారు. 

ఆ సంచిని తెరిచి చూడగా అందులో 14 విగ్రహాలు ఉన్నాయి. దాంతో పాటు సంచిలో ఓ లేఖ కూడా ఉంది. ‘విగ్రహాలు దొంగలించినప్పటి నుంచి రాత్రి నిద్రపట్టడం లేదు. పీడ కలలు వస్తున్నాయి. అందుకే తిరిగి ఇచ్చేస్తున్నాము’ అంటూ లేఖలో పేర్కొన్నారు. ఆలయ పూజారి సంచిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి జరిగిన విషయాన్ని వారికి చెప్పారు. ఈ విగ్రహాలు 300 ఏళ్ల నాటివని, వీటిలో 9 అష్టధాతు విగ్రహాలని, మరో మూడు ఇత్తడివని ఆలయ పూజారి వెల్లడించారు. 

 

Leave a Comment