ఇక నుంచి ఆటోమేటిక్‌ మ్యుటేషన్‌

భూ లావాదేవీలకు త్వరలో అమలు

అమరావతి: భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ఆటోమేటిక్‌ మ్యుటేషన్‌ను పక్కాగా అమలులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆటోమేటిక్ మ్యుటేషన్లో భూములు కొనుగోలు చేసిన వారు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోగానే రెవెన్యూ అధికారులే వారి పేరుతో రికార్డులను సవరిస్తారు.దీని ద్వారా కొనుగోలుదారులు రెవెన్యూ రికార్డుల్లో సవరణ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు.  

ప్రస్తుతం మీసేవలోనే సేవలు..

ప్రస్తుతం భూములను కొన్నవారే రెవెన్యూ రికార్డుల్లో తమ పేరుతో మార్చాలని కోరుతూ నిర్దిష్ట రుసుము చెల్లించి మీ–సేవలో దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకు రిజిస్ట్రేషన్‌ దస్తావేజులు, ఇతర పత్రాలను స్కాన్‌చేసి ఆధారాలుగా చూపాల్సి ఉంటుంది. అయితే ఇలా మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేసినా రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. లంచం ఇస్తేనే  మ్యుటేషన్లు చేస్తున్నారనే విమర్శలు గత ప్రభుత్వ హయాంలో వ్యక్తమయ్యాయి. ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అవినీతి రహితంగా, ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు ఆటోమేటిక్‌ మ్యుటేషన్‌ దిశగా కసరత్తు ప్రారంభమైంది.

 ఆటోమేటిక్‌ మ్యుటేషన్, ఇతర అంశాలపై రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. ఆటోమేటిక్‌ మ్యుటేషన్‌కు ఏర్పాట్లు చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత జరిగే భూముల రిజిస్ట్రేషన్లు అన్నీ నెల రోజుల్లోగా రెవెన్యూ రికార్డుల్లో మార్పుచేర్పులు చేస్తారు. రిజిస్ట్రేషన్‌ వివరాలను సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయం ఏ రోజుకారోజు సంబంధిత తహసీల్దారు కార్యాలయానికి పంపుతుంది. తహసీల్దారు దీన్ని పరిశీలించి నెల రోజుల్లోగా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేస్తారు.  

Leave a Comment