ఏపీలో 4 జోన్ల ఏర్పాటుకు రంగం సిద్ధం..!

ఏపీలో 3 రాజధానులకు గవర్నర్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకు దక్కాలనే ఉద్దేశ్యంతో ఏపీలో 4 జోన్లు ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జోన్ల తర్వాతే రాజధాని మార్పు చేయాలని యోచిస్తున్నారు. విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప కేంద్రాలుగా జోన్లు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టనుంది ప్రభుత్వం. ఈ జోన్లకు చైర్మన్ లుగా మంత్రులు, ఎమ్మెల్యేలను నియమించనున్నారు. దీనిపై రేపు మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. 

జోన్లుగా విభజించే జిల్లాలు ఇవే..

విజయనగరం జోన్:

దీని పరిధిలో మూడు జిల్లాలు విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు వస్తాయి. పరిధిలోకి వచ్చే కొత్త రాజధాని విశాఖలో ఐటీ హబ్ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మైనింగ్, గిరిజన సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు.

కాకినాడ జోన్ పరిధి:

దీని పరిధిలోకి మూడు జిల్లాలు వస్తాయి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు ఈ పరిధిలో వస్తాయి. ఈ జోన్ పరిధిలో ఆక్వా, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యమిస్తూ చర్యలు చేపడతారు.

గుంటూరు జోన్:

దీని పరిధిలోకిమూడు జిల్లాలు వస్తాయి. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలు ఈ జోన్ పరిధిలో ఉంటాయి. పరిధిలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పోర్టులు, ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యం ఇస్తారు.

కడప జోన్:

ఈ జోన్ పరిధిలో సీమలోని నాలుగు జిల్లాలు ఉన్నాయి. చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాలు ఈ జోన్ పరిధిలోకి రానున్నాయి. ఈ జోన్ పరిధిలో హార్టికల్చర్, చిరుధాన్యాల బోర్డు, ఇతర పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది.

 

Leave a Comment