ఎంఎస్‌ఎంఈలకు రెండో విడత బకాయిలు విడుదల 

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు గత టీడీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలను వైసీపీ ప్రభుత్వం రెండో విడత రూ.512.35 కోట్లు విడుదల చేసింది. సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం జగన్ ప్రారంభించారు. ఎంఎస్ఎంఈ రంగానికి గత ప్రభుత్వం పెట్టిన రాయితీలను చెల్లిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా మే నెలలో రూ.450 కోట్లు మొదటి విడతగా ఇవ్వగా, నేడు రూ.512.35 కోట్లు రెండో దఫా రీస్టార్ట్‌ ప్యాకేజీలో ఇచ్చారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ చిన్న పరిశ్రమలు బాగుంటేనే రాష్ట్రాభివృద్ధిలో వేగం ఉంటుందన్న ఆయన, ఈ ఏడాది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎం)కు ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పారు. అదే విధంగా వచ్చే ఏడాది స్పిన్నింగ్‌ మిల్లులకు చేయూతనిస్తామని, వాటికీ దాదాపు రూ.1000 కోట్ల బకాయిలు చెల్లిస్తామన్నారు. పరిశ్రమలకు గత ప్రభుత్వం దాదాపు రూ.4 వేల కోట్లు బకాయి పెట్టిందని, వాటన్నింటినీ తాము చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. మాట మీద నిలబడితేనే పెట్టుబడులు వస్తాయన్న ఆయన, ఆ దిశగా ప్రభుత్వం పూర్తి చొరవ చూపుతుందని వెల్లడించారు. చిన్న చిన్న పరిశ్రమల వల్ల గ్రామాల్లోనూ ఉద్యోగాలు లభిస్తాయని, ఐటిఐ వంటి కోర్సులు చదివినా ఉపాధి అవకాశాలు ఉంటాయని సీఎం చెప్పారు.

రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ రంగంలో మొత్తం 97,428 యూనిట్లు ఉండగా, వాటిలో 72,531 సూక్ష్మ పరిశ్రమలు కాగా, 24,252 చిన్న పరిశ్రమలు, మరో 645 మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. వాటి ద్వారా దాదాపు 10 లక్షల మందికి ఉద్యోగ, ఉపా«ధి అవకాశాలు లభిస్తున్నాయని ఆయన తెలిపారు.

కొనుగోళ్లలోనూ ప్రాధాన్యం

ప్రభుత్వానికి ఏటా అవసరమైన దాదాపు 360 రకాల వస్తువులు, ఇతర సామాగ్రిలో 25 శాతం ఎంఎస్‌ఎంఈల నుంచి తీసుకోవాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి తెలిపారు. వాటిలో 4 శాతం ఎస్సీ, ఎస్టీలకు చెందిన కంపెనీలు, మరో 3 శాతం మహిళలకు చెందిన యూనిట్ల నుంచి సేకరించాలని దిశా నిర్దేశం చేశామని చెప్పారు. ఇంకా వాటన్నింటికి 45 రోజుల్లోనే బిల్లులు చెల్లించాలని ఆదేశించామని వెల్లడించారు.

 

Leave a Comment