యువకుడి చెంప చెళ్లమనిపించిన కలెక్టర్.. సస్పెండ్..! 

లాక్ డౌన్ నిబంధనలు బ్రేక్ చేశాడని ఓ యువకుడితో దురుసుగా ప్రవర్తించాడు చత్తీస్ గడ్ రాష్ట్రం సూరజ్ పూర్ కలెక్టర్.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మందులు కొనడానికి వెళ్లిన ఆ యువకుడిపై కలెక్టర్ చెయ్యి చేసుకోవడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కలెక్టర్ రణబీర్ శర్మపై వేటు వేశారు చత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బాఘెల్. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించాడని ఆ యువకుడిపై కలెక్టర్ చెయ్యి చేసుకున్న వీడియో వైరల్ కావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సీఎం కార్యాలయం ప్రకటించింది. 

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో సూరజ్ పూర్ జిల్లాలో కలెక్టర్ రణబీర్ శర్మ లాక్ డౌన్ అమలు తీరును పర్యవేక్షిస్తున్నారు. ఈక్రమంలో అత్యవసరంగా మందులు కొనడానికి వెళ్తున్న ఓ వ్యక్తిని కలెక్టర్ రణబీర్ శర్మ, పోలీసులు అడ్డుకుని దురుసుగా ప్రవర్తించారు. ఆ వ్యక్తి మందులకు సంబంధించిన చీటీలు చూపిస్తున్నా.. ఫోన్ లాక్కోని నేలకేసి కొట్టి చెంప చెళ్లుమనిపంచారు కలెక్టర్.. పోలీసులను కూడా కొట్టమని ఆదేశాలిచ్చారు. ఇద్దరు కానిస్టేబుళ్లు లాఠీలతో కొట్టారు. కలెక్టర్ చెయ్యి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కలెక్టర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ ఘటనపై కలెక్టర్ రణబీర్ శర్మ స్పందించారు. క్షమాపణలు చెబుతూ.. కావాలని చేయలేదని వెల్లడించారు. తన కుటుంబం కూడా కోవిడ్ బారినపడినా తాను విధులు నిర్వహిస్తున్నానని, తప్పుడు పేపర్లతో ఆ వ్యక్తి బయట తిరుగుతున్నాడని, ఇలాంటి సమయంలో ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలను కోరారు. కానీ, బాధితుడు మాత్రం మెడికల్ షాప్ కి వెళ్తున్నా అని చెబుతున్నా కలెక్టర్ తనపై దురుసుగా వ్యవహరించారని వాపోయాడు.. అయితే ఈ ఘటనలో యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

 

Leave a Comment