మే 17 నుంచి పదో తరగతి పరీక్షలు..!

తెలంగాణ విద్యాశాఖ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసింది. మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాంచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9,10 తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. పదో తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత మే 26 నుంచి జూన్ 13వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. 

 గతంలో ఆరు సబ్జెక్టులకు 11 పరీక్షలు నిర్వహించేవారు. కానీ ఈ ఏడాది ఆరు సబ్జెక్టులకు ఆరు పరీక్షలు నిర్వహించనున్నారు. నాలుగు ఎఫ్ఏ టెస్టులకు గానూ రెండు ఎఫ్ఏ టెస్టులు మాత్రమే నిర్వహిస్తున్నారు. మొదటి ఎఫ్ఏను మార్చి 15న, రెండో ఎఫ్ఏ టెస్టును ఏప్రిల్ 15న నిర్వహించనున్నారు. సమ్మేటీవ్ అసెస్ మెంట్ ను మే7 నుంచి 13వ తేదీ మధ్యలో నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

కాగా 9,10వ తరగతుల విద్యార్థులకు హాజరు విషయంలో ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వారు స్కూల్ కు తప్పనిసరిగా హాజరు కావాల్సిన అవసరం లేదని వెల్లడించింది. సరిపడా హాజరు శాతం లేకపోయినప్పటికీ విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు అనుమతించనున్నారు. జిల్లాల్లో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు, హైదరాబాద్ జిల్లాల్లో ఉదయం 8.45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఆన్ లైన్ క్లాసులు అయితే పదో తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య, 9వ తరగతి విద్యార్థులకు సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య నిర్వహించనున్నారు. 

 

Leave a Comment