భారత్ లో ‘టెలీమెడిసిన్’ వైద్యసేవలు

కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో భారత దేశంలో టెలీమెడిసిన్ విధానంలో వైద్యసేవలు అందించేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విధానంలో ఫోన్, మెసేజ్ లేదా వీడియో కాల్ ద్వారా వైద్యులు రోగులకు వైద్య సలహాలు ఇస్తారు. టెలీమెడిసిన్ విధానం ద్వారా ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా దూరంగా ఉన్న రోగులకు చికిత్సను అందజేస్తారు. దీని ద్వారా రోగుల వల్ల వైద్య సిబ్బందికి, ఇతరులకు కూడా అంటువ్యాధి సోకే ప్రమాదాన్ని నివారించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో తక్కువ సమయంలో ఎక్కువ మందికి వైద్యం అందుతుంది. 

టెలీమెడిసిన్ విధానాన్ని ఎందుకు తెచ్చారు..

కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. దీంతో జనజీవనం స్థంభించిపోయింది. రవాణా వ్యవస్థ కూడా నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఆస్పత్రులకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో టెలీమెడిసిన్ విధానంలో సేవలు అందించడానికి ఎంసీఐ, నీతి ఆయోగ్ తో చర్చలు జరిపి మార్గదర్శకాలను రూపొందించింది. అందుబాటులో ఉన్న సాంకేతికతను ఏ విధంగా ఉపయోగించాలో వైద్యులు, వైద్య సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. 

టెలీమెడిసిన్ వైద్య సేవలు అందించేందుకు రిజిస్టర్ చేసుకున్న వైద్యులు మాత్రమే అర్హులు. రోగికి సాంకేతిక సేవలు సరిపోతాయో లేదా నేరుగా వైద్యం అందించాలా అనేది వైద్యులు నిర్ణయిస్తారు. ఈ విధానంలో వీడియో, ఆడియో, ఫోన్ మెసేజ్ ల ద్వారా సేవలు అదించవచ్చు. ఔషధాలను సూచించేందుకు రోగి తన వయస్సును కచ్చితంగా తెలపాలి. ప్రభుత్వ అనుమతి పొందిన వైద్యులు మాత్రమే వైద్య సలహాలు అందించాలని ఆన్ లైన్ ప్లాట్ ఫాంలకు ఎంసీఐ నిర్దేశించింది. మొబైల్ యాప్ లు, వెట్ సైట్లు వంటి టెక్నాలజీ ప్లాట్ ఫాంల ఏర్పాటుకు సూచనలు జారీ చేసింది. 

Leave a Comment