ఆ ఉపాధ్యాయుడి జీతం లక్ష..కానీ తనకు బాదులు వేరే యువకుడితో పాఠాలు..!

ఇతను ఓ ప్రభుత్వ ఉపాధ్యాయులుడు.. నెలకు లక్షకుపైగా జీతం తీసుకుంటాడు.. కానీ పిల్లలకు పాఠాలు మాత్రం చెప్పడు. అసలు స్కూల్ కే వెళ్లడం లేదు.. సెలవు పెట్టాడా.. లేదా అధికారుల నుంచి అనుమతి తీసుకున్నాడా.. అంటే అదీ లేదు.. తనకు బదులుగా వేరే యువకుడితో పిల్లలకు పాఠాలు చెప్పిస్తూ హ్యాపీగా జీవితం గడుపుతున్నాడు. అతడికి రోజు కొంత మొత్తం డబ్బులు ఇస్తున్నాడు.. ఈ ఉపాధ్యాయుడి బాగోతం ఎట్టకేలకు బయటపడింది. 

అది తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం.. ఛత్తీస్ గఢ్ సరిహద్దున ఉన్న మారుమూల గిరిజన గ్రామం ఇరకంపేట.. ఇక్కడో గిరిజన ప్రాథమిక పాఠశాల ఉంది. ఇందులో 52 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ ఇద్దరు టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒక ఉపాధ్యాయుడు దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. మరో ఉపాధ్యాయుడి పేరు ముచ్చిక రెడ్డి.. నెలకు రూ.లక్షకు పైగా జీతం తీసుకుంటున్నాడు. ఒక ఉపాధ్యాయుడు లేకపోవడంతో ఇతను తప్పనిసరిగా స్కూల్ కి వెళ్లాలి. 

ఏడుగురాళ్లపల్లిలో నివాసం ఉంటున్న ముచ్చిక రెడ్డి మాత్రం విధులకు హాజరుకావడం లేదు. తనకు బదులు అదే గ్రామానికి చెందిన మరో యువకుడు ముచ్చిక రవికుమార్ తో పాఠాలు చెప్పిస్తున్నాడు. అతడికి రోజుకు రూ.150 చొప్పున చెల్లిస్తున్నాడు. ఈ విషయం బయటకు రావడంతో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు మురళి, కొంత మంది వైసీపీ నాయకులు శనివారం పాఠశాలను సందర్శించారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మురళి అన్నారు. పాఠశాలకు గైర్హాజరు అవుతున్న ఉపాధ్యాయుడు ముచ్చిక రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.   

Leave a Comment