విద్యార్థి తల్లిపై కన్నేసిన టీచర్.. కోరిక తీర్చకుంటే పిల్లల భవిష్యత్ నాశనం చేస్తానంటూ బెదిరింపు..!

విద్యాబుద్ధులు నేర్పార్సిన టీచర్ కీచకుడిగా మారాడు. తన కోరిక తీర్చాలంటూ విద్యార్థి తల్లిని వేధిస్తున్నాడు. తన మాట వినకుంటే పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం న్యూ చిట్యాల గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొల్లా శ్రీనివాసరావు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటింటికీ వెళ్లి నిమ్మకాయలు విక్రయిస్తుంటుంది. ఈక్రమంలో ఆమె తన వ్యాపారం ముగించుకుని ఇంటికి వస్తున్న తరుణంలో ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు ఆమె పైట చెంగు పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు. 

దీంతో ఆమె ఆగ్రహంతో ఇంటికి వెళ్లిపోతుంటే అతడు ఆమెను అనుసరించడమే కాకుండా ఆమె ఇంటికి వెళ్లి మరీ అసభ్యంగా ప్రవర్తించాడు. తన కోరిక తీర్చకుంటే పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తానంటూ బెదిరించి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనికి ఆమె ప్రతిఘటించడంతో దాడికి దిగాడు. అడ్డు వచ్చిన మహిళ తల్లిదండ్రులపైనా దాడి చేశాడు.  

ఈ ఘటనపై మహిళ కుటుంబ సభ్యులతో పాటు పలువురు స్థానికులు ఆందోళన చేపట్టారు. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బెల్లంకొండ క్రాస్ రోడ్డు వద్ద ధర్నా చేశారు. ఆ ఉపాధ్యాయుడిని తక్షణమే విధుల నుంచి తొలగించి, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

 

Leave a Comment