కేంద్ర మంత్రిని ప్రశ్నించినందుకు ఉపాధ్యాయుడు సస్పెండ్..!

ఎరువుల సరఫరాపై కేంద్ర మంత్రిని ప్రశ్నించినందుకు కర్ణాటకకు చెందిన ఓ ఉపాధ్యాయుడు సస్పెండ్ అయ్యాడు. కేంద్ర మంత్రిని ప్రశ్నించిన ఆడియో క్లిప్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సదరు ఉపాధ్యాయుడిపై రాష్ట్ర విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఏం జరిగిదంటే.. బీదర్ జిల్లాలోని హెదాపురా గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కుశాల్ పాటిల్.. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖూబాను ఫోన్ చేసి ఎరువుల సరఫరాపై పప్రశ్నించారు. 

 రైతు బిడ్డగా చెప్పుకున్న టీచర్ పాటిల్ ఫర్టిలైజర్ బస్తాలు దొరకడం లేదని, వీటి కొరత ఎందుకు ఉందని మంత్రిని ప్రశ్నించారు. దీనిపై తానేమీ చేయలేనని మంత్రి అన్నట్టు ఆ కాల్ రికార్డింగ్‌లో ఉంది. కేంద్రం మంత్రి తాను ఇదివరకే రాష్ట్రాలకు ఎరువులు పంపానని, స్థానిక ఎమ్మెల్యేను కలవాలని పాటిల్‌కు సూచించారు. 

అయితే ఈ సంభాషణ చివరకు వేడెక్కింది. పాటిల్ కేంద్ర మంత్రిని తమ ఊళ్లో ఓట్లెలా అడుగుతారో చూస్తామని వ్యాఖ్యానించారు. బీదర్ లోక్‌సభ నుంచి మరోసారి ఎన్నిక కాబోవంటూ మాట్లాడారు. దీనికి కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ ‘నేను కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నాను. మీరు మీ ఎమ్మెల్యే దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్లండి..’ అని సూచించారు.

అయితే ఈ ఆడియో క్లిప్ వైరల్ కావడంతో విచారణ జరిపారు. దీనిపై స్థానిక బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఒక ప్రాథమిక నివేదిక సమర్పించారు. దీని ఆధారంగా ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు. టెలిఫోనిక్ సంభాషణను ఉద్దేశపూర్వకంగా రికార్డు చేసి బాధ్యతారాహిత్యానికి, దుష్ప్రవర్తనకు పాల్పడ్డందుకు, ఆ ఆడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేసినందుకు గాను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఫర్టిలైజర్స్ గురించి అడిగినందుకు తనను శిక్షించారని, గత సీజన్‌లో ఫర్టిలైజర్స్ లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురయ్యానని సదరు ఉపాధ్యాయుడు తెలిపారు.

Leave a Comment