టెట్ పాసైతే జీవితకాలం చెల్లుబాటు..!

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) సర్టిఫికెట్ చెల్లుబాటు కాలాన్ని ఏడేళ్ల నుంచి జీవిత కాలానికి పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. ఈ కొత్త నిర్ణయం 2011 నుంచి వర్తిస్తుందని తెలిపారు. ఇప్పటికే ఏడేళ్లు పూర్తయిన టెట్ ధ్రువపత్రాలకు పున్:ధ్రువీకరణ అందించడం లేదా కొత్తగా సర్టిఫికెట్లను మళ్లీ జారీ చేయడానికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. 

ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకునే వారికి ఉద్యోగ అవకాశఆలను మెరుగుపరచడానికి తీసుకున్న ముందడుగుగా కేంద్ర మంత్రి అభివర్ణించారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియామకం పొందాలంటే టెట్ ఒక తప్పనిసరి అర్హత. టెట్ ను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయని, ఆ ధ్రువపత్రం ఏడేళ్ల వరకు చెల్లుబాటు అవుతుందని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి(ఎన్సీటీఈ) 2011 ఫిబ్రవరి 11న మార్గదర్శకాలు విడుదల చేశారు.

టెట్ ధ్రువపత్రాల చెల్లుబాటు కాలపరిమితిని ఏడేళ్ల నుంచి జీవితకాలం చేయడంతో నిరుద్యోగ టీచర్ అభ్యర్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. గతంలో ఈ పరీక్షలు రాసి అర్హత సాధించిన వారు మళ్లీ టెట్ రాయాల్సిన అవసరం లేదు. అయితే డీఎస్సీలో అర్హత మార్కులు 20 శాతం మేర వెయిటేజీ ఇవ్వడం వల్ల వెయిటేజీ స్కోరును పెంచుకోవడానికి అభ్యర్థులు పలుమార్లు పరీక్షలు రాస్తున్నారు.  

Leave a Comment