రథోత్సవంలో అపశృతి.. 11 మంది భక్తులు సజీవదహనం..!

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. తంజావూరులో ఆలయ రథయాత్రలో షార్ట్ సర్క్యూట్ తో 11 మంది భక్తులు సజీవదహనమయ్యారు.. మరి కొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. తంజావూరులోని కలిమేడు అప్పర్ ఆలయంలో గురుపూజై సందర్భంగా స్వామివారికి ఆలయ నిర్వాహకులు రథోత్సవం నిర్వహించారు. 

బుధవారం తెల్లవారుజామున భక్తులు రథాన్ని లాగుతుండగా ఒక్కసారిగా హై టెన్షన్ కరెంట్ వైర్ తగిలింది. షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 11 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది..

ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. మరోవైపు ప్రధాని మోడీ కూడా ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. పీఎం ఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం, గాయపడిన వారికి రూ.50 వేలు ప్రకటించారు. 

 

Leave a Comment