అత్తింటిలో మరుగుదొడ్డి లేదని.. నవవధువు ఆత్మహత్య..!

ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఎన్నో ఆశలతో అత్తింటిలో అడుగుపెట్టింది. కానీ భర్త ఇంట్లో మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడంతో పెళ్లయి నెల కూడా గడవక ముందే ఆ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల మేరకు కడలూరు అసిరిపెరియాన్ కుప్పంకు చెందిన రమ్య(27).. పుదునగర్ లో నివసించే మెడికల్ షాపు ఉద్యోగి కార్తికేయన్ అనే వ్యక్తితో రెండేళ్లు ప్రేమలో ఉంది. 

గత నెల 26న పెద్దలను ఒప్పించి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే కాపురానికి వెళ్లిన రమ్యకు అత్తింటిలో మరుగుదొడ్డి లేకపోవడం అసౌకర్యంగా అనిపించింది. భర్తను అడిగితే.. అందిరిలాగా బహిర్భూమికి వెళ్లమని సలహా ఇచ్చాడు. దీంతో రమ్య తన తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటోంది. మరుగుదొడ్డి సౌకర్యం ఉన్న ఇంటిలోకి మారుదామని భర్తను కోరింది.

 నెలరోజులైన భర్త పట్టించుకోకపోవడంతో రమ్య భర్తకు ఫోన్ చేసి నిలదీసింది. ఫోన్ సంభాషణలోనే ఇద్దరు వాదించుకున్నారు. మరో ఇంటికి మారేందుకు భర్త ఒప్పుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన రమ్య ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రమ్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Leave a Comment