IPL 2021 : బోణీ కొట్టిన సన్ రైజర్స్..!

ఐపీఎల్ 2021 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు బోణి కొట్టింది. చెపాక్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(37 బంతుల్లో 37 పరుగులు, 3 ఫోర్లు, సిక్స్) రాణించగా, మరో ఓపెనర్ బెయిర్ స్టో(63 నాటౌట్: 56 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) చివరి వరకు ఉండి విజయాన్ని అందించాడు. తొలి మ్యాచ్ ఆడిన కేన్ విలయమ్సన్(16 నాటౌట్:19 బంతుల్లో) కూడా వికెట్ ఇవ్వకుండా చివరి వరకూ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో ఫాబియన్ అలెన్ ఒక వికెట్ తీసుకున్నాడు. 

కాగా, తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ బ్యాట్స్ మెన్ సన్ రైజర్స్ బౌలింగ్ ధాటికి చేతులెత్తేశారు. వరుస విరామాల్లో పెవిలియన్ కు క్యూ కట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(4) భువీ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ అయ్యాడు. అనంతరం క్రిజులోకి వచ్చిన గేల్ తో మయాంక్ అడపాదడపా బౌండరీలు బాదాడు. 

దీంతో పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 32 రన్స్ మాత్రమే చేసింది. ఖలీల్ వేసిన ఆ మరుసటి ఓవర్ లోనే మయాంక్ అగర్వాల్.. రషీద్ ఖాన్ సూపర్ క్యాచ్ కు వెనుదిరిగాడు. ఆ వెంటనే పూరన్(0) వార్నర్ సూపర్ త్రోకు డైమండ్ డక్ గా వెనుదిరిగాడు. అనంతరం దీపక్ హూడా కూడా వెనుదిరగడంతో పంజాబ్ 63 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన ఫాబియాన్ అలెన్(6), మురగన్ అశ్విన్(9), మహ్మద్ షమీ(3) ఇలా వచ్చి అలా వెళ్లడంతో పంజాబ్ కింగ్స్ 19.4 ఓవర్లలో 120 పరుగులకు కుప్పకూలింది. 

పంజాబ్ ఆటగాళ్లలోో మయాంగ్ అగర్వాల్(25), షారుఖ్ ఖాన్(22) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగిలిన బ్యాట్స్ మెన్లు విఫలమయ్యారు. సన్ రైజర్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 3, అభిషేక్ శర్మ 2 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్ 1, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు..

Leave a Comment