వ్యాక్సిన్ వచ్చే వరకు అప్రమత్తంగా ఉండండి : మోడీ పిలుపు

పండుగ సీజన్ లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. మంగళవారం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలు ఏ దశలోనూ అలసత్వం అనేది పనికి రాదని హెచ్చరించారు. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే అందరికీ అందిస్తామని పేర్కొన్నారు. 

గత కొన్ని రోజులుగా కరోనా తగ్గిందన్న నిర్లక్ష్యం ప్రజల్లో కనిపిస్తుందని, కరోనా పూర్తిగా అంతమయ్యే వరకు అలసత్వం వద్దని సూచించారు. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచంలోని శాస్త్రవేత్తలు కష్టపడుతున్నారని, భారత్ కూడా వ్యాక్సిన్ రూపకల్పనలో చక్కని ఫలితాలు సాధిస్తోందని మోడీ తెలిపారు. కరోనా వైరస్ నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటుందన్నారు. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు బాగుందన్నారు. పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. 

బ్రెజిల్, అమెరికా దేశాల్లో మరణాల రేటు అధికంగా ఉందన్నారు. కాని భారత్ లో మాత్రం మరణాల రేటు తక్కువగా ఉందన్నారు. అయినా వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. యూరప్ దేశాలలో కరోనా కంట్రోల్ అయిందన్న నమ్మకంతో యథేచ్ఛగా ప్రవర్తించారని, ఆయా దేశాల్లో రెండో దశ కరోనా మళ్లీ పెరగడంతో వణికిపోతున్నాయని ప్రధాని మోడీ గుర్తు చేశారు. మాస్క్ ధరించడం, రెండు గజాల దూరం పాటించడం, తరచూ సబ్బుతో చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యమని మోడీ సూచించారు. 

Leave a Comment