విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా 18న రాష్ట్రవ్యాప్త ఆందోళన..!

దశాబ్దాలపాటు ఎన్నో ఉద్యమాలు చేసి, 32 మంది ప్రాణత్యాగంతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణకు నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 18 న గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నిరసన కార్యక్రమాలు, ర్యాలీలకు పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. తెలుగు ప్రజలు ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న విశాఖ ఉక్కును కేసుల మాఫీ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ పరం చేస్తూ.. రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. 

 పోస్కోతో లోపాయికార ఒప్పందంతో విశాఖ స్టీల్ ప్లాంట్ మిగులు భూమి 8వేల ఎకరాలను కాజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లారని ఆరోపించారు. ప్రైవేటీకరణకు కూడా బాటలు వేసి ప్లాంట్ నే నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ప్రత్యక్షంగా 40వేల మంది, పరోక్షంగా మరో 50 వేల మంది కార్మికులకు నీడనిచ్చి.. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధికి వెన్నెముకలా నిలిచిన విశాఖ స్టీల్ ను మరోసారి ఉద్యమస్ఫూర్తితో కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందని అన్నారు.

 తెలుగు ప్రజల ఉక్కు సంకల్పం ముందు.. జగన్మోహన్ రెడ్డి కుట్ర రాజకీయాలు సాగవని చంద్రబాబు తెలిపారు. ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడానికి ఎటువంటి పోరాటానికైనా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలో కొనసాగించే వరకు తెలుగుదేశం పార్టీ విశ్రమించదని చంద్రబాబునాయుడు తెలిపారు.

 

You might also like
Leave A Reply

Your email address will not be published.