ఆ వేళలో నిద్ర గుండెకు ఎంత ప్రమాదమో తెలుసా?

ఈరోజుల్లో తక్కువ వయసులోనే గుండెపోటుకు గురై చాలా మంది చనిపోతున్నారు. కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం తర్వాత గుండె సంబంధిత ఆరోగ్యంపై చర్చ ఎక్కువగా జరుగుతోంది. రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోవడానికి, గుండె ఆర్యోగానికి ఎటువంటి సంబంధ ఉందనే దానిపై ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై అధ్యయనాలు ఏం చెబుతున్నాయి.. ఇప్పుడు తెలుసుకుందాం..

సరైన వేళల్లో నిద్రపోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు తక్కువగా వచ్చే అవకాశం ఉందని ఇటీవల జరిగిన అధ్యయనాల్లో గుర్తించారు. బ్రిటన్ కు చెందిన బయో బ్యాంక్ నిర్వహించిన ఈ అధ్యయనంలో 88 వేల మంది వాలంటీర్లపై పరిశోధన చేశారు. రాత్రిపూట 10-11 గంటల మధ్య నిద్రపోయే వారిలో గుండె సంబంధిత సమస్యలు తక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది. 

యూరోపియన్ హార్ట్ జర్నల్ లో ప్రచురించిన వివరాల ప్రకారం ఈ అధ్యయనంలో పాల్గొన్న పాల్గొన్న వాలంటీర్ల చేతికి స్మార్ట్ ఫిట్ నెస్ బ్యాండ్లు అమర్చారు. 7 రోజుల పాటు వారు నిద్రించే, మెల్కోనే సమయాలపై డేటాను వారు సేకరించారు. వారి గుండె కొట్టుకునే తీరు, రక్త ప్రసరణలో వచ్చిన మార్పులను పరిశీలించారు. వారిలో కేవలం 3వేల మంది పెద్దలు గుండె సంబంధిత సమస్యల బారిన పడ్డారు. వారిలో రాత్రి 11 తర్వాత నిద్రపోతున్న వారే ఎక్కువగా ఉన్నారు.

 గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపే ఇతర అంశాలపై కూడా పరిశోధకులు దృష్టి సారించారు. వాలంటీర్ల వయసు, బరువు, వారి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు వంటివి కూడా పరిశీలించారు. కానీ ఇందులో వాటి ప్రభావం కనిపించలేదు. తమ అధ్యయనంతో పూర్తి నిర్ధారణకు రావడం కష్టమని, అయితే ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మన జీవ గడియారానికి అంతరాయం కలిగే అవకాశం ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. అది గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైనట్లు చెబుతున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం చాలా ప్రమాదకమని, ఇది శరీర గడియారాన్ని సెట్ చేసే ఉదయపు వెలుతురు శరీరానికి అందకుండ చేస్తుందని పరిశోధకులు అంటున్నారు. రాత్రిపూట 10 నుంచి 11 గంటల మధ్య నిద్రపోవడం గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని తమ అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి.

అయితే ఇది ఒక్కటే కాదు.. రక్తపోటు, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలి.. రెగ్యులర్ గా వ్యాయామాలు చేయాలి. ఉప్పు, ఆల్కహాల్ ను తగ్గించడంతో పాటు జీవనశైలిని జాగ్రత్తగా చూసుకోవాలి. సమతుల ఆహారం కూడా గుండె ఆర్యోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

Leave a Comment