‘సీఎం ఆఫ్ ద ఇయర్’గా వైఎస్ జగన్..!

సీఎం జగన్ దేశంలోనే అత్యంత గౌరవమైన ‘సీఎం ఆఫ్ ద ఇయర్’ అవార్డును దక్కించుకున్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల తీరుతెన్నులపై అధ్యయనం చేసిన స్కోచ్ సంస్థ ఈ అవార్డును ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే సీఎం జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన  హామీలన్నింటినీ నెరవేరుస్తూ, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. 

ఆరోగ్యశ్రీ, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ చేయూత వంటి పథకాలతో పేదల పెన్నిధిగా నిలుస్తోన్న సీఎం జగన్ ని స్కోచ్ గ్రూప్ ‘సీఎం ఆఫ్ ద ఇయర్’ అవార్డుతో సత్కరించింది. ఈ నేపథ్యంలో స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్ మంగళవారం సీఎం జగన్ ని క్యాంపు కార్యాలయంలో స్వయంగా కలిసి అవార్డును అందజేశారు. పాలనలో ఉత్తమ ప్రతిభ కనబర్చినందుకు గాను ఈ అవార్డును ఇస్తున్నట్లు వెల్లడించారు. 

ఈ సందర్భంగా సమీర్ కొచ్చర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఏడాది పాటు వివిధ రాష్ట్రాల్లో ప్రాజెక్ట్ స్థాయి ఫలితాల అధ్యయనం ఆధారంగా సీఎం జగన్ ని ‘సీఎం ఆఫ్ ద ఇయర్’ గా ఎంపిక చేశామన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతున్న ‘వైఎస్సార్ రైతు భరోసా కేంద్ర’ పథకం ద్వారా ముందుగా ప్రకటించిన కనీస మద్దతు ధరకే గ్రామ స్థాయిలో రైతులు పండించిన పంటను సేకరిస్తున్నారని చెప్పారు. 

ఈ పథకం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని కితాబిచ్చారు. అదేవిధంగా మహిళల భద్రత, రక్షణ కొరకు తీసుకొచ్చిన దిశ, అభయ్ వంటి పథకాలు శాంతి భద్రతల పట్ల అవగాహనతో పాటు మహిళల రక్షణకు కృషి చేస్తున్నాయని ప్రశంసించారు. కరోనా కాలంలో ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం చూపిన చొరవను ప్రత్యేకంగా ప్రశంసించాల్సిందేనని పేర్కొన్నారు. 

కోవిడ్ కాలంలోనూ రాష్ట్ర వ్యాప్తంగా 123 ప్రాజెక్టులను ప్రభుత్వం అమలు చేసిందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ కొన్ని సాహసోపేత నిర్ణయాలను తీసుకున్నారని తెలిపారు. పాలనను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడానికి గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక చర్యలు తీసుకుందని సమీర్ కొచ్చర్ ప్రశంసించారు. 

Leave a Comment