బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు దీక్ష చేస్తా : వైఎస్ షర్మిల

సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిను రాజు అనే దుండగుడు అత్యాచారం చేసి హత్య చేసిన సంగతి తెలిసిందే.. ఈ ఘటనపై ప్రతి ఒక్కరూ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇటు సెలబ్రెటీల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ఈ ఘటనను ఖండిస్తున్నారు. నిందితుడి ఆచూకీ ఇంత వరకు దొరకలేదు. ఆచూకీ తెలిపిన వారికి తెలంగాణ పోలీసులు రూ.10 లక్షల రివార్డును కూడా ప్రకటించారు. అతడి ఆనవాళ్లను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ ఇంతవరకు అతడి ఆచూకీ మాత్రం లభించలేదు. 

ఈ ఘటనపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల తీవ్రంగా స్పందించారు. బుధవారం చిన్నారి కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సంఘటనపై స్పందించే వరకు అక్కడే దీక్ష చేపడతానని హెచ్చరిస్తూ దీక్ష చేపట్టారు. ఘటన జరిగి ఆరు రోజులు అవుతున్నా సీఎం కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. చిన్నారి చైత్ర కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదన్నారు. కేసీఆర్ నోరు విప్పి, బాధి కుటుంబానికి భరోసా ఇచ్చేంత వరకు నిరాహార దీక్ష చేస్తానని షర్మిల వెల్లడించారు.

కాగా, చిన్నారికి న్యాయం చేయాలని షర్మిల చేపట్టిన దీక్షను గురువారం తెల్లవారుజామున పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వ పెద్దలు ఎవరైనా స్పందించారా అని షర్మిల ప్రశ్నించారు. రాజు లాంటి దుర్మార్గుడు ఇంకా సమాజంలో తిరుగుతూ ఉండాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు కాబట్టే స్పందించకుండా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని బలవంతంగా మోసుకు వచ్చారని, కారు ఎందుకు దిగాలని ప్రశ్నించారు. చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు దీక్ష కొనసాగుతుందని తెలిపారు. 

Leave a Comment