అందరి ముందు ప్యాంట్ విప్పించారు.. అవమానంతో ఆత్మహత్య చేసుకున్నాడు..!

పరీక్షకు స్లిప్పులు తెచ్చాడని పాలిటెక్నిక్ విద్యార్థిని తనిఖీల పేరుతో అందరి ముందు అవమానించారు. దీంతో మనస్తాపం చెందిన ఆ విద్యార్థి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చిరాల్లోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం జరిగింది. వేటపాలెం మండలం లక్ష్మీపురానికి చెందిన కమల నాగరాజు, ఇందిర దంపతుల రెండో కుమారుడు ఎలీషా(19) బైపాస్ రోడ్డులోని యలమంచిలి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న పాలిటెక్నిక్ కాలేజీలో ఈఈఈ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. 

సోమవారం నుంచి కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయి. స్లిప్పులు తెచ్చి పరీక్ష రాస్తున్నాడని స్క్వాడ్ అధికారులు పరీక్ష కేంద్రం వద్దే ప్యాంట్ విప్పించి తనిఖీ చేశారు. అంతేకాక పరీక్ష రాయకుండా బయటకు పంపించారు. డీబార్ కూడా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఎలీషా సాయంత్రం బేరుపేట సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అన్యాయంగా తమ బిడ్డను పొట్టన పెట్టుకున్నారని, తమకు న్యాయం చేయాలని, తమ బిడ్డ చావుకు కారణమైన వారిని శిక్షించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. 

 

Leave a Comment