కఫీల్ ఖాన్ కేసులో సంచలన తీర్పు..!

రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ కఫీల్ ఖాన్ కేసు విషయంలో అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కఫీల్ ఖాన్ ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. డాక్టర్ కఫీల్ ఖాన్ గత ఆరునెలలుగా మధుర జైలులో ఉంటున్నారు. డాక్టర్ కఫీల్ ఖాన్ పై విధించిన జాతీయ భద్రతా చట్టం ఉత్తర్వులను కూడా హైకోర్టు రద్దు చేసింది. 

జాతీయ భద్రతా చట్టాన్ని పొడిగించడం కూడా చట్టవిరుద్ధమని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆగస్టు 28న విచారణ పూర్తి అయిన తర్వాత హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. సీఏఏ, ఎన్ఆర్సీకి సంబంధించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కఫీల్ ఖాన్ పై అలీగఢ్ అధికారులు జాతీయ భద్రతా చట్టం కింద అభియోగాలు మోపారు. గోరఖ్ పూర్ వైద్యుడు డాక్టర్ కఫీల్ ఖాన్ ను జనవరి 29న అరెస్టు చేశారు. దీనికి వ్యతిరేకంగా ఆయన తల్లి నూజాత్ పర్వీన్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కఫీల్ ఖాన్ ప్రసంగాన్ని పూర్తిగా విన్న హైకోర్టు ప్రసంగంలో ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవని, మరియు అలీఘర్ లో శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు లేవని తెలిపింది. 

2017లో గోరఖ్ పూర్ లోని బీఆర్ డీ మెడికల్ కాలేజీలో 60 మందికిపైగా చిన్నారులు మరణించిన సమయంలో డాక్టర్ కఫీల్ వెలుగులోకి వచ్చారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై ఆయనను సస్పెండ్ చేశారు. ఎన్సెఫాలిటిస్ వార్డులో తన విధుల్లో నిర్లక్ష్యం వహించడమే కాకుండా ప్రైవేటుగా ప్రాక్టీస్ చేశారనే ఆరోపణలతో కఫీల్ ఖాన్ ను అరెస్టు చేశారు. అయితే గత ఏడాది అతడిని కోర్టు అన్ని ఆరోపణల నుంచి నిర్దోషిగా ప్రకటించింది. 

 

Leave a Comment