చిన్నారులకు కొత్త రకం వ్యాధి..ఇది సోకితే డేంజర్..!

ఉత్తరప్రదేశ్ లో ఇటీవల మరో కొత్త రకం వ్యాధి కలకలం రేపింది. ఇప్పటికే అక్కడ చాలా మంది పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్డారు. వైరల్ జ్వరంతో పాటు రాష్ట్రంలో అనేక మంది పిల్లలు మరణించారు. ఈ వ్యాధిని స్క్రబ్ టైఫస్ గా వైద్యులు గుర్తించారు. మథుర జిల్లాలోని ఒక్క కోహ్ గ్రామంలోనే 26 మంది స్క్రబ్ టైఫస్ వ్యాధి బారిన పడ్డారని జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రచన గుప్తా తెలిపారు. ఆగ్రా, ఫిరోజాబాద్, మెయిన్ పురి, ఎటా, కస్గంజ్ జిల్లాల్లో కూడా ఈ వ్యాధి సోకి మరణాలు సంభవించాయని పేర్కొన్నారు. 

స్క్రబ్ టైఫస్ అంటే ఏంటీ?

 సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(CDC) ప్రకారం, ఇది ‘ఓరియెన్షియా సుత్సుగముషి’ అనే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి. స్క్రబ్ టైఫస్ సోకిన చిగ్గర్స్(లార్వా పురుగులు) కాటు ద్వారా ప్రజలకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. 

స్క్రబ్ టైఫస్ లక్షణాలు ఇవే:

  • జ్వరం
  • తలనొప్పి
  • ఒళ్లు నొప్పులు
  • కొన్ని సార్లు దద్దుర్లు
  • తీవ్ర సందర్భాల్లో ఇది న్యుమోనిటిస్, ఎన్ సెఫాలిటిస్, కోమా, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వంటి వాటికి దారితీస్తుంది. 

ఈ వ్యాధి నివారణకు ప్రస్తుతం ఎటువంటి టీకాలు అందుబాటులో లేవని సీడీసీ తెలిపింది. వ్యాాధి సోకిన వ్యక్తికి డాక్సీ సైక్లిన్ మందులతో చికిత్స చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ వ్యాధి నివారణకు పిల్లల శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను వాడాలి. దోమలు, చిగ్గర్స్ కాటుకు గురికాకుండా ఉండాలి. చిగ్గర్స్ ఎక్కువగా చెట్ల పొదలు ఉన్న ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి. ఆ ప్రాంతాల్లో వెళ్లకపోవడమే మంచిది. 

Leave a Comment