వచ్చే 90 రోజుల్లో ప్రతి కుటుంబానికి స్క్రీనింగ్

అధికారులకు సీఎం జగన్ ఆదేశం

కోవిడ్‌ నివారణ తదుపరి చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పటిష్టమైన క్షేత్రస్థాయి వ్యూహాన్ని అమలు చేయనుంది. వచ్చే 90 రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని పూర్తిస్థాయిలో స్క్రీనింగ్‌ చేయాలని, పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. దీని కోసం 104 వాహనాలను వినియోగించుకోవాలన్నారు. 

అనుమానం ఉన్న వారి నుంచి కోవిడ్‌ శాంపిల్‌ తీసుకునే సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడంతో పాటు, మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించడానికి పరీక్షలు నిర్వహించి, వారికి అక్కడే మందులు కూడా ఇవ్వాలన్నారు. దీనికి అనుగుణంగా 104లో సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. నెలలో కనీసం ఒకసారి గ్రామంలో 104 ద్వారా వైద్యసేవలు, స్క్రీనింగ్‌ జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. స్క్రీనింగ్, పరీక్షలు చేసిన తర్వాత వివరాలను క్యూఆర్‌ కోడ్‌ ఉన్న ఆరోగ్య కార్డులో పొందుపర్చాలన్నారు. పట్టణాలకు సంబంధించి కూడా ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తి, నివారణా చర్యలపై సీఎం జగన్‌ సోమవారం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతి మండలానికి ఒక 104 వాహనాన్ని అందించాలని, కరోనా నిర్ధారణ కోసం శాంపిళ్లు తీసుకునే సదుపాయాన్ని వాహనంలో అమర్చాలని తెలిపారు. ప్రజల్లో భయాందోళనలు (స్టిగ్మా) తొలగించేలా అవగాహన, చైతన్యం కల్పించాలన్నారు. 

Leave a Comment