సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో పాఠశాలలు ప్రారంభం..!

ఏపీలో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు పున: ప్రారంభిచాలని నిర్ణయించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కోవిడ్-19 నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకనుగుణంగా పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.  మెరుగైన విద్య, విద్యార్థులకు రుచికరమైన జగనన్న గోరుముద్ద(మధ్యాహ్న భోజన పథకం) అందించే చర్యలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆయన నివాసంలో సమీక్షా సమావేశం జరిగిందన్నారు. 

రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. ఇంగ్లీష్ మీడియం, జగనన్న గోరుముద్ద పకడ్బందీగా అమలు చేయడానికి రాష్ట్ర స్థాయిలో రెండు డైరెక్టర్ స్థాయి పోస్టులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. ఇందుకు సంబంధించి విధివిధానాలు రూపొందించాలన్నారు. 

మూడో విడత జగనన్న గోరుముద్ద డ్రై రేషన్ పంపిణీకి పచ్చజెండా….

కరోనా నేపథ్యంలో ఇప్పటికే జగనన్న గోరుముద్ద పథకం కింద విద్యార్థులకు నేరుగా ఇళ్ల వద్దకే డ్రై రేషన్ అందజేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి సెప్టెంబర్ 5వ తేదీ నుంచి పాఠశాలలు పున: ప్రారంభించాలని అనుకుంటున్నామన్నారు. అంత వరకూ మూడో విడత డ్రైరేషన్ పంపిణీ కొనసాగించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. ‘జగనన్న గోరుముద్ద… మన పిల్లలు-మన భవిష్యత్తు’ పేరుతో రుచికరమైన, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన మెనూ అందించాలని నిర్ణయించామన్నారు. నాడు-నేడు పథకం కింద పాఠశాలల వంట గదుల నిర్మాణాలు చేపట్టనున్నామన్నారు. సురక్షితమైన తాగునీటి పంపిణీతో పాటు మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. 

ఇప్పటికే ఆయా తరగతుల్లో సిలబస్ మార్పులు చేపట్టామని మంత్రి తెలిపారు. బ్రెయిలీ లిపి పుస్తకాల్లోనూ కొత్త సిలబస్ అందించనున్నామన్నారు. రాబోయే విద్యా సంవత్సర నుంచి 1 నుంచి 5వ తరగతి వరకూ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు హ్యాండ్ బుక్ లు రూపొందించామన్నారు. ప్రతి సబ్జెక్టుకూ వర్క్ బుక్ అందివ్వనున్నామని మంత్రి తెలిపారు. డైట్ సెంటర్లను టీచర్ ట్రయినింగ్ సెంటర్లగా మార్పు చేయనున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి జిల్లాకో టీచర్ ట్రైనింగ్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఆన్ లైన్లో స్కూళ్లకు అనుమతులు, గుర్తింపు పత్రాలు జారీ చేయనున్నామన్నారు. ఇకపై ప్రతి ఏటా అకాడమిక్ ఆడిటింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఖాళీగా ఉన్న ఎంఈవో, డిప్యూటీ డీఈవో పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనున్నామన్నారు. ఈ పోస్టుల భర్తీ వ్యవహారం కోర్టులో ఉన్నందున న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

You might also like
Leave A Reply

Your email address will not be published.