దీనావస్థలో సచిన్ బాల్య మిత్రుడు వినోద్ కాంబ్లీ.. ఏదైనా పని ఇప్పించాలని..!

సచిన్ టెండూల్కర్ బాల్య మిత్రుడు, టీమిండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ దీనావస్థలో ఉన్నాడు. ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయి ప్రస్తుతం పూట గడవని స్థితిలో ఉన్నాడు..క్రికెట్ కి సంబంధించిన ఏదైనా పని ఇప్పించాలని బీసీసీఐని కోరుకుంటున్నాడు.. ఈ విషయాన్ని తానే స్వయంగా మీడియాలో వివరించాడు..ప్రస్తుతం బీసీసీఐ తనకు రూ.30 వేలు పెన్షన్ ఇస్తోందని, ఇదొక్కటే తనకు ఆదాయ మార్గమని వెల్లడించాడు. 

సచిన్ టెండూల్కర్ కి విషయం తెలియదా అని విలేకరులు ప్రశ్నించగా.. అంతా తెలుసని, కానీ సచిన్ నుంచి తాను ఏమీ ఆశించడం లేదని అన్నాడు. టెండూల్కర్ మిడిల్ సెక్స్ గ్లోబల్ అకాడమీలో ఉద్యోగం ఇప్పించింది సచినే అని తెలిపాడు. సచిన్ ఇప్పటికే తనకెంతో చేశాడని అన్నాడు.  కొద్ది రోజుల క్రితం వరకు నేరుల్ లో ‘టెండూల్కర్ మిడిల్ సెక్స్ గ్లోబల్ అకాడమీ’లో యువ క్రికెటర్లకు మెంటార్ గా పని చేసేవాడినని తెలిపాడు. అయితే నేరుల్ తన నివసించే ప్రాంతానికి చాలా దూరంగా ఉండటతో చాలా ఇబ్బందికరంగా మారిందన్నాడు. దీంతో ఆ ఉద్యోగాన్ని వదులుకున్నానని వివరించాడు.   

ముంబై క్రికెట్ అసోసియేషన్ చొరవ తీసుకొని వాంఖడే లేదా బీకేసీ స్టేడియంలో ఏదైనా క్రికెట్ కి సంబంధించిన పని ఇప్పిస్తే కుటుంబాన్ని పోషించుకుంటానని కోరాడు. తాను రిటైర్డ్ క్రికెటర్ ని కాబట్టి బీసీసీఐ నుంచి పెన్షన్ అందుతోందని, ఈ డబ్బుతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, ఇందుకు బీసీసీఐకి రుణపడి ఉంటానని కాంబ్లీ చెప్పాడు.   

కాగా, వినోద్ కాంబ్లీ టీమిండియా తరఫున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. 3500 పైగా పరుగులు చేశాడు. వన్డేల్లో 2 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు, టెస్టుల్లో 4 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు చేశాడు. టెస్టుల్లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు కూడా బాదాడు. 1991 నుంచి 2000 మధ్య కాలంలో ఇండియా తరఫున కాంబ్లీ ఆడాడు.    

 

Leave a Comment