ఏపీ సరిహద్దుల వద్ద ఆర్టీసీ బస్సులు : పేర్ని నాని

నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి, బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించేవారికి, జీవితం పట్ల అవగాహన లేని వారికి సరైన క్రమశిక్షణ నేర్పించే ఉద్దేశంతోనే జరిమానాలు పెంచడం జరిగిందని సమచార పౌర సంబంధాల శాఖ, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. హైదరాబాద్ లేక్ వ్యూ అతిథి గృహంలో శనివారం ఉదయం పాత్రికేయుల సమావేశంలో పేర్ని నాని మాట్లాడారు. వాహనాలకు సంబంధించి సక్రమమైన పేపర్లు కలిగి, రూల్ పాటిస్తూ వాహనాలు నడిపేవారికి ఈ విధానం శ్రీరామ రక్షగా నిలుస్తుంది అని, దీన్ని సామాజిక బాధ్యతగా వాహనదారులు భావించాలని పేర్నినాని తెలిపారు.

సరిహద్దుల వద్ద ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు..

ఆర్టీసి బస్ సేవల గురించి వివరిస్తూ వ్యాపార ధోరణితో రెండు తెలుగు రాష్ట్రాలు వ్యవహరించడం లేదని, కేవలం ప్రజలకు రవాణా సౌకర్యం పునరుద్దరించాలనే ఉద్దేశంతో ఏపీఎస్ ఆర్టీసీ 1.04 లక్షల కి.మీ. తగ్గించుకుందని తెలిపారు. 1.61 లక్షల కి.మీకే పరిమితం చేస్తూ తెలంగాణ ఆర్టీసీ అధికారులు కోరినట్లే ప్రతిపాదనలు పంపిస్తూ, రూట్ల వారీగా స్పష్టత కూడా ఇచ్చామన్నారు. ఈ ప్రతిపాదనలతో ఏపీ ఎస్ ఆర్టీసీ లాభ నష్టాలను చూడకుండా కేవలం ప్రయాణికుల ఇబ్బందుల దృష్ట్యా టీఎస్ ఆర్టీసీ డిమాండ్లకు అనుకూలంగా ప్రతిపాదనలు పంపామన్నారు.

 ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో జూన్ 18 నుంచి చర్చలు జరుపుతున్నామని మంత్రి అన్నారు. ఆర్టీసీ కార్గో సేవలు మాత్రం కోవిడ్ సమయంలో సైతం కొనసాగుతున్నయని పేర్ని నాని తెలిపారు. దసరా పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఏపీ సరిహద్దు చెక్ పోస్ట్ లు – పంచలింగాల, గరికపాడు, వాడపల్లి, పైలాన్, జీలుగుమిల్లి, కల్లుగూడెంల వద్ద ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచడం జరిగిందని, ఈ అవకాశం ప్రజలు వినియోగించుకోవాలని మంత్రి కోరారు

 

Leave a Comment