కేవలం రూ.2 ఫీజుతో ఏడాది పాటు ట్యూషన్..

ఈ ఆధునిక కాలంలో ప్రతిఫలం ఏమీ ఆశించకుండా ఉండే వ్యక్తులను చూడటం చాలా కష్టం..కానీ ఇక్కడ మనకు ఓ రియల్ లైఫ్ హీరో ఉన్నారు. ఆయన పేరు సుజిత్ ఛటోపాధ్యాయ.. పశ్చిమ బెంగాల్ కి చెందిన ఈ 78 ఏళ్ల రిటైర్డ్ టీచర్ 350 గిరిజన మరియు నిరుపేద పిల్లలకు బోధించారు. అయితే వారి వద్ద ఆయన వసూలే చేసే ఫీజు కేవలం రూ.2 మాత్రమే..ఆయన పాఠశాలకు 20 కి.మీ. దూరం నుంచి విద్యార్థులు వస్తారు..  

పశ్చిమ బెంగాల్ లోని తూర్పు బుర్ద్వాన్ జిల్లాలో మారుమూల కుగ్రామం రామ్ నగర్ లో ఛటోపాధ్యాయ నివసిస్తుంటారు. 2004లో రిటైర్డ్ అయిన ఆయన.. గత 18 ఏళ్లుగా ఇంట్లోనే విద్య బోధిస్తున్నారు. ‘సదాయి ఫకీరర్ పాఠశాల’(ది ఎటర్నల్ ఫకీర్స్ స్కూల్) అని పేరు పెట్టి ఇంట్లోనే స్కూల్ నడుపుతున్నారు. 

ఈ పాఠశాలలో 80 శాతం మంది విద్యార్థులు దిగువ-మధ్య తరగతి కుటుంబాలకు చెందిన బాలికలు ఉన్నారు. పాఠశాల ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఆయన్ను ‘మాస్టర్ మోషాయ్’ అని కూడా పిలుస్తారు. 

రిటైర్డ్ అయిన తర్వాత ఛటోపాధ్యాయ ఖాళీగా ఉండేవారు. ఒక రోజు ముగ్గురు అమ్మాయిలు వచ్చిఆయన నుంచి నేర్చుకోవాలని ఉందని చెప్పారు. ఆ ముగ్గురు అమ్మాయిలు తన వద్ద నేర్చుకోవడానికి 20 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అలా ముగ్గురి నుంచి ప్రారంభమైన ఆయన పాఠశాల 350 మందికి పెరిగింది. 

అంతేకాదు తలసేమియా రోగుల కోసం ఆయన నిధులు కూడా సేకరిస్తున్నారు. గ్రామంలో చుట్టుపక్కల ఉన్న 60 మందికిపైగా తలసేమియా రోగులకు చికిత్స కోసం నిధుల సేకరించి వారికి ఆర్థికంగా సహాయం చేయడాన్ని ప్రయత్నించారు. ఛటోపాధ్యయ చేస్తున్న సేవను గుర్తించి ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డును ఇచ్చింది. నవంబర్ 2021లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయన అవార్డు స్వీకరించారు. 

Leave a Comment