ఫోన్ పే సేవలు తిరిగి ప్రారంభం..

ఫైనాన్సియల్ యాప్ ఫోన్ పే తన సేవలను తిరిగి ప్రారంభించింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్ బ్యాంకుపై ఆర్బీఐ మారిటోరియం విధించిన విషయం తెలిసిందే. ఒక్కో వినియోగదారుడు నెలకు కేవలం రూ.50 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకోవచ్చని ఆంక్షలు కూడా విధించింది. ఈ నిబంధన వల్ల ఆ బ్యాంకుతో భాగస్వామిగా ఉన్న డిజిటల్ చెల్లింపుల ప్లాట్ ఫాం ఫోన్ పే ఇబ్బందుల్లో పడింది. బ్యాంకు ఖాతాలో ఉన్న నగదుపై ఆంక్షల నేపథ్యంలో డిజిటల్ పేమెంట్స్ సేవలకు తీవ్ర అంతరాయం  ఏర్పడింది. 

ఈ క్రమంలో రెండు రోజులుగా ఫోన్ పేలో లావాదేవీలు నిలిచిపోయాయి. కాగా ఫోన్ పే కొత్తగా ఐసీఐసీఐ బ్యాంకుతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం.. ఇక నుంచి ఫోన్ పేకు యస్ బ్యాంకు స్థానంలో ఐసీఐసీఐ నగదు సర్దుబాటు చేయనుంది. ఈ మేరకు ఫోన్ పే ముఖ్య కార్యనిర్వహణ అధికారి సమీర్ నిగమ్ ప్రకటించారు. సరైన సమయంలో ఆదుకున్నందుకు ఐసీఐసీఐ బ్యాంకుతో పాటు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ)కు ధన్యవాదాలు తెలిపారు. దీంతో డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు వాలెట్ సర్వీసులు కూడా తిరిగి అందుబాటులోకి రానున్నాయి. 

Leave a Comment