ప్రజా రవాణాపై ఆంక్షలు తొలగించాలి

ప్రజల్లో భయం పోగొట్టాలి

ప్రధాని మోడీతో సీఎం జగన్

కరోనా వైరస్ పై ప్రజల్లో భయం, ఆందోళనను తొలగించడం ద్వారానే సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని పీఎంతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ తెలిపారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఐదో సారి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌పై కార్యాచరణను ప్రధాని ఈ కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పీఎంతో మాట్లాడుతూ కేంద్ర సూచనలతో కేసులు నియంత్రించగలిగామని చెప్పారు. 

 రాష్ట్రంలో మూడు పర్యాయాలు సమగ్ర సర్వే జరిగిందని, దాదాపు 30 వేల మందిలో కరోనా లక్షణాలు కనిపించడంతో వారందరికీ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 6 వారాల లాక్‌డౌన్‌ పరిస్థితులను సమీక్షించుకుంటే.. సాధారణ పరిస్థితులు నెలకొనే దిశలో చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. 

కోవిడ్‌ను నియంత్రించలేకపోతే ముందుకు వెళ్లలేమన్నారు.  కరోనా పాజిటివ్‌ లక్షణాలు గుర్తించిన కుటుంబాలు సమాజంలో సమస్యలు ఎదుర్కొంటున్నాయని, సమాజంలో వారిపట్ల వివక్ష కనిపిస్తోందని చెప్పారు. దీని వల్ల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చెప్పడం లేదన్నారు. కరోనా లక్షణాలు కనిపిస్తే స్వయంగా చెప్పడం, వైద్య సహాయం పొందడం, తమంతట తాముగా ఐసొలేషన్‌కు వెళ్లడం వంటివి కొనసాగాల్సి ఉందన్నారు. 

కరోనాతో కలిసి ముందుకు సాగాలి..

 85 శాతం కరోనా కేసుల్లో మైల్డ్‌ సింప్‌టమ్స్‌ మాత్రమే కనిపిస్తున్నాయన్నారు.  కాబట్టి కరోనాకు వ్యాక్సిన్‌ కనుక్కొనే వరకు ఆ వైరస్‌లో మనం కలిసి ముందుకు సాగాల్సి ఉందన్న విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సి ఉందని తెలిపారు. 

 మీడియాలో కరోనాపై భయాందోళనలు పెంచే కధనాల కన్నా, వాస్తవాలను చెప్పాలని, దాదాపు 95 శాతం వరకు ఈ వ్యాధిని నయం చేయవచ్చన్న విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించాలని చెప్పారు.  వైద్య ఆరోగ్య రంగంలో గ్రామ స్థాయి నుంచి అత్యున్నత స్థాయిలో టీచింగ్‌ ఆస్పత్రుల స్థాయిలో సమూల మార్పులు తీసుకువచ్చే దిశలో రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందన్నారు. 

తయారీ రంగం పూర్తిగా స్తంభించింది…

తయారీ రంగం పుంజుకోవాలంటే ముడి సరుకులు అందడం, ప్రజల మూవ్‌మెంట్‌ అనేది చాలా అత్యవసరమన్నారు.  సరుకుల రవాణాకు అనుమతించినప్పటికీ చాలా రాష్ట్రాల్లో అవరోధాలు ఏర్పాడుతున్నాయన్నారు. తమ రాష్ట్రంలో తయారీ రంగం పూర్తిగా స్తంభించిపోయిందని తెలిపారు.  

దేశవ్యాప్తంగా మార్కెట్లు, రిటైల్‌రంగం మూతపబడి ఉండడంతో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ లేదన్నారు. దీంతో రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు మిగులు కనిపించి… తీవ్రంగా దెబ్బపడుతోందన్నారు. 

రవాణాకు అవరోధాలు తొలగిపోవాలి..

రాష్ట్రాల మధ్య రవాణాకు సంబంధించి పూర్తి అవరోధాలు తొలగిపోవాలని కోరారు. ప్రజలు తమ పనులకు వెళ్లాంటే…. ప్రజారవాణా అందుబాటులో లేదన్నారు. ప్రజా రవాణా రంగంమీద ఉన్న ఆంక్షలను తొలగించాలి.  వివిధ రాష్ట్రాల్లోని పరిశ్రమల్లో పనిచేస్తున్న కూలీలు తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్న వారు తాము పనిచేసిన చోటుకు తిరగి రాకపోతే సాధారణ పరిస్థితులు తిరిగి రావన్నారు.  బస్సుల్లో సరిపడినంత భౌతిక దూరం పాటించాలన్నారు. 

 షాపింగ్‌ సెంటర్లు కూడా తెరుచుకునేందుకు అవకాశం కల్పిస్తూనే భౌతిక దూరం, మాస్క్‌లు ధరించేలా చూడాలన్నారు.  వీటిని సరిగ్గా అమలు చేసేలా స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌లను అందుబాటులోకి తీసుకురావాలన్నారు.  భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లుధరించేలా, వ్యక్తిగత శుభ్రత పాటించేలా నియమాలు, నిబంధనలను తీసుకురావాలని సూచించారు.  

మా రాష్ట్రానికి కేంద్ర సాయం కావాలి..

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ఆస్పత్రులు, ఆరోగ్య మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కనీసంరూ.16వేల కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించచాలంటే ఈ విషయంలో కొత్త రాష్ట్రంగా తమకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని కోరారు.  వడ్డీలు లేని లేదా వడ్డీలు తక్కువగా ఉండే దీర్ఘకాలిక చెల్లింపుల ప్రాతిపదికన రుణాలు ఇవ్వాలన్నారు. 

నిరుద్యోగం పెరుగుతుంది..

రాష్ట్రంలో దాదాపు 87 వేలకు పైగా ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఉన్నాయని,  9.7లక్షల మంది ఈ రంగంలో ఉపాధి పొందుతున్నారని చెప్పారు. ప్రతి యూనిట్లో కనీసం 10 మంది ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. ఈ రంగానికి చేయూత నివ్వకపోతే కుప్పకూలిపోతుందన్నారు.

ఎంఎస్‌ఎంఈ రంగం స్తంభించిపోతే… నిరుద్యోగం అన్నిచోట్లా పెరుగుతుందని, 6 నెలలు, అంటే 2 త్రైమాసికాలు ఎంఎస్‌ఎంఈలకు వడ్డీ మాఫీ చేయాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలు బాగుంటేనే… పేదలకు మేలు జరుగుతుందని, లాక్‌డౌన్‌ సడలింపు చర్యల సమయంలో ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని కోరారు. పౌరులంతా సాధారణ జీవితాలు గడపడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

 

Leave a Comment