ఏపీ అసెంబ్లీలో NRC, NPR పై తీర్మానం

రాష్ట్రంలో NRC, NPR కు సంబంధించి తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ అమోదం చేసింది. రాష్ట్రంలో NRC అమలు చేయబోమని ప్రకటించింది. అదేవిధంగా NPR-2020పై కొత్తగా చేర్చిన అంశాలతో ముస్లింలలో భయాందోళన నెలకొందని, NPR ని  2010 ఫార్మట్ ప్రకారం అమలు చేయాలని కోరింది. బుధవారం ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా NRC, NPR సంబంధించి బిల్లును ప్రవేశపెట్టారు. 

ఈ సందర్భంగా అంజాద్ బాషా మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న NRC, NPRలకు సంబంధించి ముస్లిం మైనారిటీలు అభద్రతా భావానికి లోనై ఉన్నారన్నారు. మైనారిటీలలో నెలకొన్న అభద్రతా భావాన్ని తొలగిస్తూ ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో NRCని అమలు చేయమని గతంలో సీఎం జగన్ అన్నారని తెలిపారు. 

గతంలో కూడా 2010, 2015లో ఎన్‌పీఆర్‌ నిర్వహించారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు 2020లో నిర్వహిస్తున్న ఫార్మట్‌లో కొన్ని అభ్యంతర అంశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తల్లిదండ్రుల వివరాలు, వారు పుట్టిన తేదీ, ప్రదేశానికి సంబంధించిన వివరాలతో పాటు, ఇంకా మాతృభాషకు సంబంధించి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని వెల్లడించారు. 

2010 నాటి ఫార్మట్‌ ప్రకారమే ఎన్‌పీఆర్‌ కొనసాగించాలని, అప్పటి వరకు ఇప్పటి ఎన్‌పీఆర్‌ ఆపాలని కోరుతున్నామని, అన్నారు. ఎన్‌ఆర్‌సీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధానానికే కట్టుబడి ఉందింటూ డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, బిల్లును ప్రవేశపెట్టగా, సభ దాన్ని ఆమోదించింది.

 

Leave a Comment