శ్రీలంకలో రికార్డు స్థాయికి ఇంధన ధరలు..  పెట్రోల్ రూ.420, డీజిల్ రూ.400..!

ఆర్థిక సంక్షోభంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న శ్రీలంకలో ఇంధన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మంగళవారం ఇంధన ధరలను భారీగా పెంచుతూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ధరను 24.3, డీజిల్ ధరను 38.4 శాతం పెంచింది. ఈ పెంపుతో శ్రీలంకలో ఆక్టేన్ 92 పెట్రోల్ ధర రూ.420, డీజిల్ ధర రూ.400కు చేరింది..

శ్రీలంకలో చమురు నిల్వలు అడుగంటిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభం కారణంగా విదేశీ మారక నిల్వలు భారీగా క్షీణించాయి. దీంతో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ప్రభుత్వం కూడా ఇంధనం అడుగంటిపోకుండా చర్యలు తీసుకుంటుంది. 

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఖర్చులు తగ్గించే చర్యగా ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని చెబుతోంది. ఆయా కంపెనీలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను నిర్దేశించాయి. రవాణా, ఇతర సేవా ఛార్జీల సవరణకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈ సవరణ ప్రతి 15 రోజులకు లేక నెల రోజులకు ఒకసారి ఉంటుందని ఇంధన శాఖ మంత్రి తెలిపారు. 

Leave a Comment