రషీద్ ఖాన్ కొత్త హెలికాప్టర్ షాట్ చూశారా?.. వీడియో వైరల్..!

కౌంటీ క్రికెట్ లో భాగంగా ససెక్స్, హాంప్ షైర్ జట్ల మధ్య శుక్రవారం టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ససెక్స్ తరఫున ఆడుతున్న ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ కొట్టిన ఓ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షాట్ వీడియోను రషీద్ ఖాన్ తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశాడు. ‘ కొన్ని షాట్లు పుస్తకంలో ఉండవు. వాటికి మనమే పేరు పెట్టాలి. ఏం పేరు పెడితే బాగుంటుందో చెప్పండి’ అంటూ క్యాప్షన్ జత చేశాడు. 

ససెక్స్ తరపున ఆడుతున్న రషీద్ ఖాన్ ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి 13 బంతుల్లో 26 పరుగులు చేశాడు. హాంప్ షైర్ బౌలర్ స్కాట్ కర్రీ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓబర్ మూడో బంతిని రషీద్ ఖాన్ ఓ షాట్ ఆడాడు. అది లాంగ్ ఆఫ్ మీదుగా బౌండరీ వెళ్లింది. ఆ షాట్ చూస్తే ధోని హెలికాప్టర్ షాట్ లా కనిపిస్తున్నా.. సాధారణంగా హెలికాప్టర్ షాట్ లో బంతి మిడాన్ లేదా లెడ్ సైడ్ దిశగా వెళ్తుంది. కానీ రషీద్ కొట్టిన షాట్ మాత్రం లాంగాఫ్ మీదుగా వెళ్లింది. 

ఈ షాట్ ను రషీద్ ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల పేర్లు సూచిస్తున్నారు. ‘హెలికాప్టర్ షాట్, ఆఫ్ఘన్ జిలేబీ షాట్, కవర్ హెలికాప్టర్, రాస్ షాట్, ఆఫ్ఘని హెలికాప్టర్, మినీ హెలికాప్టర్, గిల్లిదండా షాట్ అంటూ రకరకాలుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  

Leave a Comment