భర్త సినిమాకు తీసుకెళ్లలేదని భార్య ఆత్మహత్య..!

ఈరోజుల్లో చిన్న చిన్న విషయాలకే క్షణికావేశంలో జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.. మరి కొందరు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు.. తాజాగా ఓ భార్య తన భర్త సినిమాకు తీసుకెళ్లలేదని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో గురువారం చోటుచేసుకుంది. 

వివరాల మేరకు వికారాబాద్ జిల్లా సంగెం గ్రామానికి చెందిన రాజు, స్వాతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మూడు నెలల క్రితమే.. ఇంట్లో పెద్దలను ఎదిరించి మరీ గుడిలో పెళ్లి చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత పెద్దలను ఒప్పించారు. రాజు శంకరపల్లిలోని ఓ హోటల్ లో పనిచేస్తున్నాడు. బుధవారం రాత్రి భార్య స్వాతి తనను సెకండ్ షో సినిమాకు తీసుకెళ్లాలని భర్తను కోరింది. 

అయితే రాజు మాత్రం ఈ రోజు వద్దు.. రేపు వెళ్దామని చెప్పాడు. ఈ విషయంలో వారి మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో స్వాతి మనస్తాపానికి గురైంది. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Leave a Comment