నీళ్ల కుండను తాకాడని.. దళిత విద్యార్థిని కొట్టి చంపిన టీచర్..!

స్కూల్ లో మంచి నీళ్ల కుండను తాకాడనే కారణంతో ఓ దళిత విద్యార్థిని ఉపాధ్యాయుడు విచక్షణారహితంగా కొట్టాడు.. దీంతో ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు.. ఈ ఘటన రాజస్తాన్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జలోర్ జిల్లలోని సురానా గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చెయిల్ సింగ్ అనే ఉపాధ్యాయుడు తన కోసం ప్రత్యేకంగా నీళ్ల కుండను ఉంచుకున్నాడు.. 

ఆ స్కూల్ లో ఇంద్రకుమార్ మేఘవాల(9) అనే దళిత విద్యార్థి మూడో తరగతి చదువుతున్నాడు. గతనెల 20న స్కూల్ లో దాహం వేయడంతో మంచి నీళ్లు తాగేందుకు చెయిల్ సింగ్ పెట్టుకున్న కుండ వద్దకు వెళ్లాడు. అంతే కోపోద్రిక్తుడైన చెయిల్ సింగ్ ఆ బాలుడ్ని విచక్షణారహితంగా కొట్టాడు. కులం పేరుతో దూషిస్తూ తీవ్రంగా చితకబాదాడు. దీంతో కళ్లు, ముఖ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి.. 

తల్లిదండ్రులు మేఘవాలను వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఉదయ్ పూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి అహ్మదాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సుమారు 25 రోజుల పాటు చికిత్స అందించినా బాలుడి ప్రాణాలు నిలువలేదు. ఈ ఘటనపై రాజస్తాన్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. సమగ్ర విచారణకు సీఎం అశోక్ గెహ్లాట్ ఆదేశించారు. టీచర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Leave a Comment