మండిపోతున్న యువత.. రణరంగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్..!

అగ్ని పథ్ పథకంకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రణరంగంగా మారింది. రైల్వే స్టేషన్, ప్లాట్ ఫారమ్స్ ల దగ్గర యుద్ధ వాతావరణం నెలకొంది. రైలు బోగీలు మంటల్లో కాలిపోయాయి. పార్సిల్ కార్యాలయంలో ఉన్న బైకులు, ఇతర సామన్లు అగ్నికి ఆహుతియ్యాయి.

 ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరిపారు. టియర్ గ్యాస్ం ప్రయోగించారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. రైల్వే స్టేషన్ వద్ద ఆర్మీ అభ్యర్థులు బైఠాయించారు. అగ్నిపథ్ స్కీమ్ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం అహర్నిశలు శ్రమిస్తే నాలుగేళ్లు సర్వీస్ ఇస్తారా అంటూ నినదించారు. 

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒకటి, రెండు ప్లాట్‌ఫారాలపై మోడీ డౌన్ డౌన్ అంటూ యువత పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వందల సంఖ్యలో నిరసన కారులు రైల్వే స్టేషన్ చేరుకుని రైళ్లను అడ్డుకుంటూ, అక్కడే ఉన్న రైల్వే పార్శిళ్లను పట్టాలపై వేసి తగులబెట్టారు. ఓ రైలుకు మంటలు అంటుకున్నాయి. కోల్‌కతా వెళ్లే ఈస్ట్ కోస్ట్ రైలులోని రెండు బోగీలు తగలబడి పోయినట్టు తెలిసింది. 

రైల్వే అధికారులు రైళ్లన్నింటినీ నిలిపివేశారు. ఈ సంఘటనలతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. రైలు దిగి పరుగులు తీశారు. కాగా రైల్వే స్టేషన్‌లో నిరసనలకు తమకు సంబంధం లేదని కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం (ఎన్ఎస్‌యూఐ) తెలంగాణ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ప్రకటించారు..

ఆర్మీపై ఆర్థిక భారం తగ్గించేందుకు కేంద్రం అగ్నిపథ్ స్కీమ్ తెచ్చింది. ఈ పథకం ద్వారా ఆర్మీకి ఎంపికైన అగ్నివీరులకు నాలుగేళ్లపాటు సర్వీసు అందించే అవకాశం ఉంటుంది. ఇందులో మూడో వంతు మంది పదవీ విరమణ పొందాల్సి ఉంటుంది. పదవీ విరమణ పొందిన వారికి పెన్షన్ సౌకర్యం ఉండదు. ఇలాంటి స్కీమ్‌ను ఊహించని యువత దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలకు దిగుతోంది.

Leave a Comment