రైతాంగాన్ని రక్షించుకోవాలి

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

రైతాంగాన్ని రక్షించుకోవడానికి శాస్త్రవేత్తలు, పరిశ్రమ వర్గాలు కృషి చేయాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని అనేక సవాళ్లు వేధిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో పెరుగుతున్న పెట్టుబడులు, కూలీల కొరత దృష్ట్యా సేద్యం లాభసాటిగా ఉండటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏస్‌ఏయూ) ప్రాంగణంలో నిర్వహించిన అగ్రిటెక్‌ సౌత్‌-2020 సదస్సు శనివారం ప్రారంభమైంది. మూడు రోజల పాటు జరిగే ఈ సదస్సును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు లాంఛనంగా ప్రారంభించారు.

వ్యవసాయాన్ని అనేక సవాళ్లు వేధిస్తున్నాయ్‌…

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ… చాలామంది రైతులు వ్యవసాయం వదిలేసి ప్రత్యామ్నాయ వృత్తుల్లోకి వెళుతున్నారని అన్నారు. ఆ లోపాలు గుర్తించి వ్యవసాయాన్ని సుస్థిరంగా తీర్చిదిద్దేందుకు శాస్త్రవేత్తలు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వం, పీజేటీఎస్ఏయూ, సీఐఐ కలికట్టుగా వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దినట్లైతే రైతుల ఆదాయాలు మరింత పెరుగుతాయని వివరించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి సరిపోదని.. ఉత్పాదకత పెరగాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్ కంటే అతి చిన్న దేశం వియత్నాంలో వరి ఉత్పత్తి పది రెట్లు అధికమని చెప్పారు. కాఫీ ఉత్పత్తిలోనూ అదే పరిస్థితి ఉందని.. ఉత్పత్తి, ఉత్పాదకతలో ఎక్కడ లోపాలు ఉన్నాయో గుర్తించి వాటిని అధిగమించేందుకు శాస్త్రవేత్తలు కృషి చేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు. వ్యవసాయ రంగం, రైతాంగం బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంటు, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతోందని మంత్రి వివరించారు.

Leave a Comment