జైలులో ఫోన్ మింగేసిన ఖైదీ.. ఆపరేషన్ లేకుండా తీసిన డాక్టర్లు..!

ఢిల్లీలోని అత్యంత భద్రతతో కూడిన తీహార్ జైలులో ఉన్న ఓ ఖైదీ మొబైల్ ఫోన్ మింగేశాడు.. జైల్ వార్డెన్, ఇతర ఖైదీల కళ్ల ముందే ఆ ఖైదీ ఫోన్ మింగాడు. వెంటనే అతడిని జైలులోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి.. పది రోజుల పాటు కష్టపడి అతడి పొట్టలో నుంచి మొబైల్ ఫోన్ ని బయటకు తీశారు. ప్రస్తుతం ఆ ఖైదీ ఆరోగ్యంగానే ఉన్నట్లు జైలు డీజీ సందీప్ గోయల్ తెలిపారు.

వివరాల మేరకు.. ఓరోజు అధికారులు జైలులోని ఖైదీల గదులను తనిఖీ చేశారు. ఖైదీల వద్ద ఏమైనా అనుమతించని వస్తువులు ఉన్నాయా అని వెతికారు. ఆ సమయంలో ఓ ఖైదీ అనుమానాస్పదంగా కనిపించాడు. ఏదో దాచేందుకు ప్రయత్నం చేశాడు. అనుమానం వచ్చిన వార్డెన్ వెంటనే అతడి వద్దకెళ్లాడు. అంతలోనే అతడు ఫోన్ ని మింగేశాడు.. ఆ ఫోన్ చాలా చిన్నగా ఉందని అధికారులు తెలిపారు. 

దీంతో ఆ ఖైదీని వెంటనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అతడికి ఎక్స్ రే నిర్వహించి పొట్టలో ఫోన్ ఉన్నట్లు నిర్ధారించారు. పది రోజుల పాటు కష్టపడి ఆపరేషన్ లేకుండానే ఆ ఫోన్ ని బయటకు తీశారు. ఆ ఖైదీని కొద్ది రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచినట్లు డీజీ సందీప్ గోయల్ చెప్పారు. అతడి ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆ ఖైదీని తిరిగి జైలుకు పంపినట్లు పేర్కొన్నారు. అయితే జైలులోకి సెల్ ఫోన్ ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. 

Leave a Comment