రామప్ప దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించండి : ప్రధాని మోడీ హర్షం

తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలోని చారిత్రక రామప్ప దేవాలయానికి వారసత్వ హోదా దక్కింది. ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడం పట్ల ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపారు. 

రామప్ప దేవాలయం కాకతీయుల అద్భతమైన నైపుణ్యం అని ప్రధాని మోడీ కొనియాడారు. అద్భుతమైన రామప్ప దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాలన్నారు. స్వయంగా శిల్పకళా సౌందర్యాన్ని ఆస్వాదించాలని ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం:

రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. యునెస్కో గుర్తింపు కోసం సహకరించిన కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. భారత్ కు మద్దతు తెలిపిన యునెస్కో సభ్య దేశాలకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప ఆలయానికి గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులను అభినందించారు. కాకతీయ శిల్పకళ దేశంలోనే ప్రత్యేకమైందన్నారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి పూర్వ వైభవానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 

Leave a Comment