కరోనా వైరస్ కు ప్రధాని మోడీయే సూపర్ స్ప్రెడర్ : ఇండియన్ మెడికల్ అసోసియేషన్

ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) ఉపాధ్యక్షుడు నవజోత్ దహియా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో కరోనా మహమ్మారి పెరుగుదలకు ప్రధాని మోడీ ప్రధాన కారణమని ఆరోపించారు. ప్రధాని మోడీని కరోనా వైరస్ కు సూపర్ స్ప్రెడర్ గా అభివర్ణించారు. 

దేశంలో ఒకవైపు కరోనా సెకండ్ వేవ్ వేగంగా ప్రబలుతుంటే ప్రధాని మోడీ మాత్రం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ప్రచార సభలు నిర్వహించారని, కుంభమేళాకు అనుమతించారని, అదే కరోనా పెరుగుదలకు కారణమైందని దహియా విమర్శించారు. కోవిడ్ నిబంధనలను గాలికి వదిలేసి ఎన్నికల్లో ప్రచార సభలు నిర్వహించి, ప్రసంగాలు చేశారని పేర్కొన్నారు. 

గతేడాది జనవరిలో తొలి కరోనా కేసు నమోదైనప్పుడు ప్రధాని మోడీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని దహియా విమర్శించారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు స్వాగతం పలకడం కోసం గుజరాత్ లో లక్ష మందికిపైగా జనంతో భారీ సమావేశం ఏర్పాటు చేశారని విమర్శలు చేశారు. 

ఏడాది కాలంగా కరోనా కట్టడికి ప్రధాని మోడీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని, అందుకే సెకండ్ వేవ్ ను ఎదుర్కోవడంలో ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా విఫలమవుతుందని దహియా పేర్కొన్నారు. అంతర్జాతీయ మీడియా సైతం భారత్ లో కరోనా వ్యాప్తికి ప్రధాని మోడీ, అతని పాలనా యంత్రాంగం వైఫల్యమే కారణమని విమర్శిస్తుందని నవజోత్ దహియా తెలిపారు.  

Leave a Comment