రామ మందిర్ నిర్మాణం కోసం రాష్ట్రపతి రూ.5 లక్షల విరాళం..!

అయోధ్యలో చేపట్టనున్న రామ మందిరం నిర్మాణం కోసం విరాళాల సేకరణ ప్రారంభమైంది. నేటి నుంచి ఈ ప్రక్రియను దేశం మొత్తం నిర్వహించనున్నారు.  ఇందులో భాగంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శుక్రవారం అయోధ్య ట్రస్టుకు రూ.5,01,000 విరాళం ఇచ్చారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తరపున సహ అధ్యక్షుడు గోవింద్ దేవ్ గిరిజీ మహారాజ్, వీహెచ్ పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్, ఆలయ నిర్మాణ కమిటీ చీఫ్ నిపేంద్ర మిశ్రా, ఆర్ఎస్ఎస్ నేత ఖుల్ భూషన్ అహుజా ఇవాళ రాష్ట్రపతి కోవింద్ ను కలిశారు. 

 ఈ విరాళాల సేకరణ రెండు దశల్లో 44 రోజులు కొనసాగనుంది. మొదటి దశ జనవరి 15 నుంచి 31 వరకు జరుతుంది. ఇందులో దేవాలయ నిర్మాణానికి వీహెచ్పీ దేశంలోని ప్రముఖుల నుంచి విరాళాలు కోరనుంది. రెండో దశ ఫిబ్రవరి 1 నుంచి 27 వరకు జరుగుతుంది. దేశంలోని సాధారణ ప్రజల నుంచి విరాళాలు సేకరించనున్నారు.  

విరాళాల కోసం ప్రత్యేక రశీదులు కూడా సిద్ధం చేశారు. రూ.10 చందా కోసం 4 కోట్ల రశీదులు, రూ.100 విరాళం కోసం 8 కోట్లు, రూ.1000 విరాళానికి 12 లక్షల రశీదులను ట్రస్ట్ ముద్రించింది. నిధుల సేకరణలో విదేశీ నిధులకు ఆస్కారం లేకుండా చూడాలని ట్రస్ట్ సూచించింది. ప్రజలు ఆన్ లైన్ లో విరాళాలు ఇవ్వొచ్చని కమిటీ తెలిపింది.  

Leave a Comment