స్థానిక రిజర్వేషన్లపై తీర్పు వాయిదా

 అమరావతి : స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ అయిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై తీర్పును హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం  ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ (19.08 శాతం), ఎస్టీ (6.77 శాతం), బీసీ (34 శాతం) రిజర్వేషన్లు 59.85 శాతంగా పేర్కొంటూ రాష్ట్రప్రభుత్వం 2019 డిసెంబరు 28న జీవో 176ని జారీ చేసింది. ఆ జీవోను, బీసీ రిజర్వేషన్లపై ఏపీ పంచాయతీరాజ్‌ చట్టంలో ఉన్న సెక్షన్లను సవాలు చేస్తూ కర్నూలుకు చెందిన బి.ప్రతాప్‌రెడ్డి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఇదే వ్యవహారంపై మరికొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

సర్వే చేయకుండా రిజర్వేషన్లు  సరికాదు : పిటిషనర్లు

ప్రతాప్‌రెడ్డి తరఫున న్యాయవాది ప్రణతి వాదనలు వినిపించారు. బీసీ జనాభా సామాజిక, ఆర్థికసర్వే నిర్వహించాకే రిజర్వేషన్లు పెంచే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. రిజర్వేషన్లు ఖరారుచేసే ముందు సర్వే తప్పనిసరన్నారు. సర్వే చేయకుండా 34 శాతం రిజర్వేషన్లు నిర్ణయించడం సరికాదన్నారు. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్న సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా 59.85 శాతం రిజర్వేషన్లు ఖరారు చేశారని వాదించారు. 

ఉహాజనిత లెక్కలు..

మరో పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వీరారెడ్డి వాదించారు. ప్రభుత్వానివి ఉహాజనిత లెక్కలపి. ఏపీ బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ బీసీ జనాభా సర్వే చేయాలని అన్నారు. ఆ డేటా ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించాలని అన్నారు.

బీసీ ఓటర్లతో పోలిస్తే తక్కువే : ఏజీ

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. బీసీ జనాభా విషయంలో గతంలో ఉన్న సమాచారం ఆధారంగా 34 శాతం రిజర్వేషన్లు కల్పించామన్నారు. ప్రస్తుతం బీసీ ఓటర్లు 48.13 శాతం ఉన్నారన్నారు. ఓటర్ల సంఖ్యతో పోలిస్తే ప్రస్తుతం కల్పిస్తున్న 34 శాతం తక్కువేనన్నారు. ఈ ఏడాది మార్చి లోపు ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సిన సుమారు రూ.3వేల కోట్లు నిలిచిపోతాయన్నారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. సర్వే చేసి రిజర్వేషన్లు నిర్ణయించాలి కదా అని ఏజీని ప్రశ్నించింది. సర్వే చేయాలన్న నిబంధనలున్నప్పుడు వాటిని అనుసరించడం తప్పనిసరని వ్యాఖ్యానించింది. ఇరువైపు వాదనలు విన్న తర్వాత తీర్పును వాయిదావేసింది.

Leave a Comment