ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీకి మళ్లీ బ్రేక్..!

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీకి కరోనా ఎఫెక్ట్ పడింది. వైఎస్సార్ జయంతి రోజు జూలై 8న ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ఏపీ ప్రభుత్వం అన్ని జిల్లాల్లో భూమిని కూడా సేకరించింది. అయితే ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం మంచిది కాదని ప్రభుత్వం భావించింది. దీంతో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. కరోనా కేసులు తగ్గితే ఆగస్టు 15న ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇళ్ల స్థలాల వాయిదా, పంపిణీ తేదీని ప్రభుత్వం ఇవాళ అధికారికంగా ప్రకటించనుంది. 

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది సంక్రాంతికి 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని భావించింది. అయితే కొన్ని కొన్ని కారణాల వల్ల దానిని అంబేద్కర్ జయంతికి వాయిదా వేశారు. అనంతరం స్థానిక సంస్థ ఎన్నికలు, ఆ తర్వాత కరోనా వైరస్ రావడంతో వైఎస్సార్ జయంతి రోజు జూలై 8న పంపిణీ చేయాలని అనుకున్నారు. కానీ ఏపీలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో ప్రజలందరూ ఒకే చోట గుమిగూడితే వైరస్ మరింత వ్యాపించే ప్రమాదం ఉంది. దీంతో ఇళ్ల పట్టాల పంపిణీని మళ్లీ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 

Leave a Comment